బెంగాల్ లో రాష్ట్రపతి పాలన...సుప్రీం ఏం చెబుతుంది ?
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతూ ఒక పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలు అయింది.
By: Tupaki Desk | 21 April 2025 11:14 PM ISTపశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతూ ఒక పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలు అయింది. దాని మీద విచారణ మంగళవారం జరగనుంది. ఇదిలా ఉంటే వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో భారీ ఆందోళనలు నిరసనలు జరిగాయి. హింస కూడా చోటు చేసుకుంది. దాంతో చాలా మంది ప్రాణాలను అరచేత పట్టుకుని ఉన్న ఊరుని విడిచి ఇతర ప్రాంతాలకు వలస పోయారు. ముగ్గురు హత్య కావించబడ్డారు.
ఎందరో ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ విధంగా చూస్తే కనుక బెంగాల్ అగ్గి మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీకి చెందిన బెంగాల్ రాష్ట్ర శాఖ నాయకులు అయితే రాష్ట్రపతి పాలన విధించమని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ రెస్పాండ్ కావడం లేదు.
దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెడితే అది వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి అడ్వాంటేజ్ గా మారుతుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అలా అని చూస్తూ ఊరుకుంటే బెంగాల్ లో పరిస్థితి వేరుగా ఉంది. రాజకీయంగా కూడా అది బీజేపీకి నష్టం చేసేలా ఉంది.
మరి బీజేపీ పెద్దలు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాఖలు అయిన పిల్ మీద విచారణ జరగనుంది. మరి సుప్రీం కోర్టు ఏమి చెబుతుంది అన్నదే అంతటా ఆసక్తిగా ఉంది. సాధారణంగా రాష్ట్రపతి పాలన వద్దు అని తీసివేయాలని కోరుతూ పిటిషన్లు కోర్టుకు వస్తాయి. పెట్టాలని కోరుతూ ఇపుడు పిటిషన్ వచ్చింది.
దాంతోనే ఇది సర్వత్రా చర్చగా ఉంది. మరో వైపు చూస్తే మేము ఏ ఆదేశాలు ఇచ్చినా కార్యనిర్వాహణ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు. అని ఈ పిటిషన్ మీద మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగు బిల్లులకు కాలపరిమితి విధిస్తూ సుప్రీం ఆదేశాలు ఇచ్చిన దాని మీద ఉప రాష్ట్రపతి సహా బీజేపీ నేతలు కొందరు కామెంట్స్ చేశారు.
దానిని దృష్టిలో ఉంచుకుని ఈ సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది అని అంటున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఆదేశాలు కానీ రాజ్యాంగ బద్ధంగా ఉంటాయి కాబట్టి బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విషయంలో ఏ నిర్ణయం చెబుతుందో అన్నదే అంతా చూస్తున్నారు.
మరో వైపు సుప్రీం కోర్టు కనుక రాష్ట్రపతి పాలనకు ఆదేశాలు ఇస్తే ఎలాంటి ఆలస్యం లేకుండా పాటించేందుకు కేంద్ర బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరి తమ చేతికి మట్టి అంటకుండా బెంగాల్ లో మమత ప్రభుత్వాన్ని ఎగరగొట్టే సదవకాశాన్ని వారు వదులుకుంటారని ఎవరూ అనుకోరనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
