ప్రశాంత్ కిశోర్ కు సుప్రీంలో చురకలు... జగన్ జస్ట్ మిస్ అయ్యారా..!
ఇటీవల కాలంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఘోర ఫలితాలు చవి చూసినవారు చేస్తున్న కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 6 Feb 2026 3:41 PM ISTఇటీవల కాలంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఘోర ఫలితాలు చవి చూసినవారు చేస్తున్న కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈవీఎంలలో మోసాలు జరిగాయని.. అధికార పార్టీలు అక్రమాలకు తెరలేపాయని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో గత ఏడాది బీహార్ లో జరిగిన ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది!
అవును... మహారాష్ట్ర, ఏపీ మొదలైన రాష్ట్రాల్లోని ఎన్నికల్లో ఈవీఎంలలో అక్రమాలు జరిగాయంటూ ఇటు వైసీపీ, అటు కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! దీనిపై రకరకాల విశ్లేషణలు, ప్రజెంటేషన్లు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఇదే సమయంలో.. గత ఏడాది బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ పీకేకి చెందిన జన సురాజ్ పార్టీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి.
వివరాళ్లోకి వెళ్తే... గత ఏడాది బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్... మొత్తం 238 స్థానాల్లోనూ పోటీ చేసింది. అయితే.. ఆ ఎన్నికల్లో 3.44% ఓట్లను మాత్రమే దక్కించుకున్న ఆ పార్టీ.. సున్నా స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా స్పందించిన పీకే... ఆ ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమి సభ్యులు ఒక్కో మహిళకు రూ.10 వేలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ.. కూటమి గెలుపు చెల్లదని ప్రకటించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
అయితే.. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం... మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి?.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.. అని చురకలు అంటిస్తూ... మీరు ప్రచారం పొందడం కోసం ఈ న్యాయ వేదికను ఉపయోగిస్తున్నారా..? హైకోర్టుకు వెళ్లకపోవడానికి కారణం ఏమిటి?.. ఇది దేశవ్యాప్తం సమస్య కాదు.. రాష్ట్రంలో ఓ హైకోర్టు ఉంది.. ఏమైనా ఫిర్యాదు చేయాలనుకుంటే అక్కడ చేయండి అంటూ వ్యాఖ్యానించింది.
కాగా... ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. అనంతరం వైసీపీ నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చర్చకు రావడం గమనార్హం. నాడు కూటమిలోని 45.60% ఓట్లు వచ్చిన టీడీపీకి 135 సీట్లు రాగా.. 6.87% సీట్లు వచ్చిన జనసేనకు 21 వచ్చాయి. ఇదే సమయంలో.. అదే కూటమిలోని బీజేపీకి 2.83% ఓట్లతో 8 సీట్లు రాగా.. 39.37% ఓట్లతో వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
అయితే.. నాడు ఈ ఫలితాలపై అధికారికంగా, అనధికారికంగా ఈవీఎంల పెర్ఫార్మెన్స్ పై వైసీపీ నుంచి పలు కామెంట్లు వచ్చినప్పటికీ... ఆ ఎన్నికలు చెల్లవంటూ ఆ పార్టీ అధినేత జగన్ సుప్రీంకోర్టు తలుపు తట్టలేదు! కాలక్రమేణా వాస్తవాలు గ్రహించో ఏమో కానీ.. 2029 ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు నడుచుకుంటున్నారు! కానీ... సున్నా సీట్లు వచ్చిన పీకే మాత్రం సుప్రీంకోర్టు తలుపు తట్టి, బీహార్ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలనడంపై సుప్రీంకోర్టు... ‘ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు!’ అని చేసిన వ్యాఖ్యలతో.. జగన్ జస్ట్ మిస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
మరోవైపు.. గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 14న ప్రారంభమైన సమయంలో జన సురాజ్ పార్టీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ కాస్త బలంగానే మొదలుపెట్టినట్లు కనిపించింది. అయితే.. రౌండ్లు ముందుకు సాగే కొద్దీ లెక్కలు మారిపోయాయి.. ఆధిక్యం క్రమక్రమంగా తగ్గిపోయింది.. ఫలితంగా సున్నా విజయాలతో, నాలుగు శాతం కంటే తక్కువ ఓట్లతో ముగిసిన పరిస్థితి! అయితే.. వాస్తవాలు గ్రహించకుండా, ప్రజా తీర్పును స్వాగతించకుండా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడం, తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు!
