'దాచేస్తా' మంటే కుదరదు: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
ప్రజల కోసం పనిచేస్తున్న వారు.. ప్రజల తరఫున పనిచేస్తున్నవారు.. ఎవరైనా పారదర్శకంగానే ఉండాల ని కోరుకుంటారు.
By: Tupaki Desk | 3 April 2025 8:00 PM ISTప్రజల కోసం పనిచేస్తున్న వారు.. ప్రజల తరఫున పనిచేస్తున్నవారు.. ఎవరైనా పారదర్శకంగానే ఉండాల ని కోరుకుంటారు. ముఖ్యంగా ఇతర విషయాలు ఎలా ఉన్నా.. సంపాదన, వెనుకేసుకునే తీరు.. ఆదాయం వంటి వాటి విషయంలో సదరు నేతలు, వ్యక్తులు, అధికారులపై ఎప్పుడు చర్చ ఉంటూనే ఉంటుంది. అందుకే.. ఆదాయ పన్ను విభాగాలు ఏర్పడ్డాయి. ఇక, నాయకుల విషయానికి వస్తే.. ఎన్నికల సమయం లో వారి ఆస్తులను ప్రకటించే విధానం కూడా పక్కాగా అమలవుతోంది.
నేతలు తమ నామినేషన్ వేసే సమయంలోనే ఆస్తులు.. అప్పులు.. ఆదాయాలకు సంబంధించిన అన్ని వివరాలను అఫిడవిట్ల రూపంలో వెల్లడిస్తారు. అయితే.. ఈ దేశం ఇప్పటి వరకు ప్రజల తరఫున.. ప్రజల కోసం పనిచేస్తున్న వారిలో ఆదాయ, వ్యయాలు.. లాభాలు, ఆస్తుల విషయంలో వెల్లడించేందుకు మినహా యింపు పొందిన ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థ. జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు.. న్యాయాదికారి నుంచి న్యాయమూర్తి వరకు ఎవరైనా సరే.. తమ ఆదాయ, వ్యయ వివరాలను వెల్లడించనక్కర్లేదు.
ఇది... ఒకప్పుడు వివాదంగా మారినప్పటికీ.. అనేక కేసులు కూడా పడినప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు న్యాయమూర్తులకు విశేషమైన అధికారం.. ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి.. వారిని ఈ విషయం నుంచి మినహాయించారు. అయితే.. రానురాను ఈ వ్యవహారం ముదిరి న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు, నోట్ల కట్టల దర్శనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లెక్కకు మిక్కిలి నోట్ల కట్టలు వెలుగు చూడడం విస్మయానికి.. వివాదానికి కూడా దారి తీసింది.
ఇదిలావుంటే.. మరోవైపు ఇంకో న్యాయమూర్తి కారులోనే నోట్లు దర్శనమిచ్చాయని జాతీయ మీడియా పేర్కొంది. అయితే.. వక్ఫ్ బిల్లు నేపథ్యంలో ఈ విషయం పెద్దది కాలేదు. ఈ పరిణామాల క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక నుంచి జిల్లా మొదలు సుప్రీంకోర్టు వరకు.. అన్ని న్యాయ స్థానాల న్యాయ మూర్తులు తమ ఆస్తులు.. అప్పులు.. ఆదాయ వివరాలు సహా.. అన్నింటినీ ప్రజల ముందు ఉంచాలని తాజాగా తీర్పు చెప్పింది. ఈ మేరకు ఉన్నస్థాయి కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విధానం పాటించాల్సిందేనని తేల్చి చెప్పడం గమనార్హం.
