Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి Vs సుప్రీం.. మలుపుతిరిగిన వివాదం

బిల్లుల ఆమోదంపై గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది.

By:  Tupaki Desk   |   18 May 2025 9:00 PM IST
రాష్ట్రపతి Vs సుప్రీం.. మలుపుతిరిగిన వివాదం
X

బిల్లుల ఆమోదంపై గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది. తమిళనాడు గవర్నర్ వైఖరిని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, శాసనసభ, పార్లమెంటు ఆమోదించిన బిల్లులను మూడు నెలలులోగా గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదించడమో లేదా తిప్పి పంపడమో చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. గడువు దాటినా నిర్ణయం తెలియజేయని బిల్లులను ఆమోదించినట్లే భావిస్తామని సుప్రీం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తమ అధికార పరిధిని సుప్రీం ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. దీనిపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వివరణ ఇవ్వనుందని భావిస్తున్న సమయంలో తాజా సమచారం వివాదాన్ని మరో మలుపు తిప్పింది.

బిల్లుల ఆమోదించే గడువు విషయంలో సుప్రీంకోర్టు కొత్తగా ఏమీ చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వం గతంలో స్వయంగా విడుదల చేసిన కొన్ని అధికారిక ఉత్తర్వులనే ప్రస్తావించి, వాటిని అమలు చేయాలని నిర్దేశించిందని తాజాగా వెల్లడైంది. ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించడం కోసం బిల్లులను రాష్ట్రపతి మూడు నెలలు లోగా ఆమోదించాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ 2016లో రెండు మెమోలు జారీ చేసింది. తీర్పును వెలువరించిన సందర్భంగా జస్టిస్ జేబీ పార్ధివాలా వీటి గురించి ప్రస్తావిస్తూ ‘గవర్నర్ సిఫార్సు మేరకు అందిన బిల్లుల మీద మూడు నెలల్లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొన్న గడువు సముచితమైనదేనని భావిస్తున్నాం.’’అని స్పష్టం చేశారు. ఈ మేరకు 2016 ఫిబ్రవరి 4న కేంద్ర హోంశాఖ జారీ చేసిన తొలి మెమోను సుప్రీంకోర్టు తన తీర్పులో ఉదహరించింది.

‘‘స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ రాష్ట్రాల బిల్లులకు సంబంధించి అనవసర జాప్యం జరుగుతోంది. దీనిని నివారించడానికి రాష్ట్రాల నుంచి అందిన మూడు నెలల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలి. దీనిని కచ్చితంగా పాటించాలి. అని మెమోలో స్పష్టంగా ఉండటం గమనార్హం. బిల్లును అందుకున్న మంత్రిత్వశాఖ 15 రోజుల్లోపు తన స్పందన హోంశాఖకు తెలియజేయాలని, జాప్యం జరిగితే అందుకు కారణాలు తెలపాలని స్పష్టం చేసింది. నెలలోపు ఎటువంటి స్పందన లేకపోతే, సదరు శాఖకు ఆ బిల్లు మీద అభ్యంతరాలు లేవని భావించాలని తెలిపింది.

దీంతో రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలకు సుప్రీం వద్ద ముందు తగిన సమాధానాలు ఉన్నట్లు అర్థమవుతోంది. తన తీర్పులోనే ఈ విషయాలు పేర్కొన్నప్పటికీ రాష్ట్రపతికి గడువు విధించడంపై ద్రౌపది ముర్ము లేవనెత్తిన అభ్యంతరాలపైనా చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు వివరణతో అంతా సర్దుమణుగుతుందని ఆశిస్తున్నారు.