Begin typing your search above and press return to search.

కుక్కలు పోతే కోతులు.. ప్యారిస్ అనుభవం చెప్పిన మేనక

దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకూడదు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Aug 2025 3:51 PM IST
కుక్కలు పోతే కోతులు.. ప్యారిస్ అనుభవం చెప్పిన మేనక
X

దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకూడదు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు ఆయన సోదరి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ నిరసన తెలిపారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు సైతం సుప్రీం ఆదేశాలతో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కుక్కలను సామూహికంగా తరలించడాన్ని కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల ఉద్యమకారిణి మేనకా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది అసాధ్యం, వేల కోట్ల ఖర్చు. పర్యావరణానికి ముప్పు’ అంటూ ఆమె హెచ్చరించారు. అంతేకాకుండా తన అధ్యయనంలో తెలిసిన ఓ ఆసక్తికర అంశాన్ని ఆమె పంచుకున్నారు. 1880లో ప్రాన్స్ రాజధాని ప్యారిస్ లో కుక్కలు పెరిగిపోయాయని సామూహికంగా చంపేశారని, దానివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ఎలుకలు పెరిగిపోయాయి. దానివల్ల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయని మేనకా గాంధీ వివరించారు. ఇప్పుడు ఢిల్లీలో కుక్కలను లేకుండా చేస్తామంటే కోతుల సంఖ్య ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే ఏం చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు.

ఇక రాహుల్ గాంధీ సైతం సుప్రీం ఆదేశాలపై విస్మయం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు సైన్సు, మానవత్వం లేని కొన్ని దశాబ్దాల కిందటి ప్రాచీన యుగంలోకి వెళ్లినట్టున్నాయని వ్యాఖ్యానించారు. మన దయ, కరుణలను దూరం చేయడమే అన్నారు. టీకాలు వేయడం, స్థానికంగా అవాసాలు ఏర్పాటుచేయడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలని సూచించారు. ఎంపీ ప్రియాంక సైతం స్పందిస్తూ కుక్కలు ఎంతో అందమైనవి, వాటి పట్ల క్రూరత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు సుప్రీం ఆదేశాలపై బాలివుడ్ నటీనటులు కూడా స్పందించారు. జాన్వీకపూర్, వరుణ ధవన్, సింగర్ చిన్మయి శ్రీపాద, నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ స్పందిస్తూ కుక్కలకు ఇది మరణ శాసనమే అని వ్యాఖ్యానించారు. మూగజీవాలపై కనికరం చూపలేమా? అంటూ ప్రశ్నించారు. ఇక తెలుగు నటుడు అడవి శేష్ కూడా సుప్రీం తీర్పుపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ కరుణా, మానవీయ సూత్రాలకు ఈ ఆదేశాలు విరుద్ధం అంటూ అడవి శేష్ వ్యాఖ్యానించారు. వరుణ్ గ్రోవర్, వీరదాస్ వంటి నటులు కూడా సుప్రీం ఆదేశాలను తప్పుబట్టారు.

మరోవైపు ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకూడదనే ఆదేశాలపై సుప్రీంకోర్టు వెనక్కి తగ్గేదేలేదని మంగళవారం కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆవరణలో శునకాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చెబుతూ కోర్టు ఆవరణలో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని తాజాగా ఆదేశించింది. కోర్టుకు వచ్చేవారు తినగా మిగిలిపోయిన పదార్థాలను కుక్కలు వేయడం వల్ల వాటికి ఆహారం లభిస్తుందని, ఇకపై ఎవరూ అలా చేయొద్దని ఆదేశించింది. మిగిలిపోయిన పదార్థాలను ధ్వంసం చేయాలని లేదా ప్యాక్ చేసి గట్టి మూతలు ఉన్న డస్ట్ బిన్లలో వేయాలని సర్కూలర్ జారీ చేసింది కోర్టు.