Begin typing your search above and press return to search.

యోగికి పాదాభివందనం...రజనీ సంచలన కామెంట్స్

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాధ్ జీ పాదాలను తాకి దండం పెట్టడం మీద తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:06 AM GMT
యోగికి పాదాభివందనం...రజనీ సంచలన కామెంట్స్
X

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాధ్ జీ పాదాలను తాకి దండం పెట్టడం మీద తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. యోగులు సన్యాసుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు అలవాటు అని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో వారు వయసులో చిన్నవారు అన్నది తాను ఆలోచించను అన్నారు. వారి ఆశీర్వాదం తీసుకోవడమే తనకు ముఖ్యమని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా రజనీకాంత్ యోగి ఆదిత్యానాధ్ పాదాలను తాకి దండం పెట్టడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ సాగింది. రజనీ తప్పు చేశారు అన్నట్లుగా ట్రోల్స్ సామాజిక మాధ్యమాలలో ఎన్నో పెట్టారు. నెటిజన్లు చాలా మంది భిన్నంగా రియాక్ట్ అయ్యారు.

రజనీ వయసుని కూడా ఎత్తి చూపిస్తూ 72 ఏళ్ళ రజనీకాంత్ 52 ఏళ్ళ యోగీ ఆదిత్యనాధ్ జీ కి దండం పెట్టడమా అని ఎకసెక్కమాడారు. అంతే కాదు తమిళుల ఆత్మగౌరవం అంటూ మరి కొందరు ఈ వివాదాన్ని ఎక్కడికో తీసుకుని పోయారు.

ఇక ఉత్తరాది దక్షిణాది అన్న తేడాలను ముందుకు తెచ్చారు. ఇవన్నీ ఒక విధంగా రాజకీయాలను మిక్స్ చేస్తూ తీవ్ర అలజడి సృష్టించాయి. రజనీకాంత్ వంటి మహా నటుడిని సోషల్ మీడియా వేదికగా పట్టుకుని నెటిజన్లు ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెప్పారు.

కానీ రజనీకాంత్ చేసిన పనిని మెచ్చుకున్న వారూ ఉన్నారు. ఆయన ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్న నటుడు అయినా నిరాడంబరంగా ఉన్నారని, ఆయన సాధారణ జీవితం గడుపుతారు అనడానికి ఎవరిని ఎలా గౌరవించాలో తెలిసిన వారు అంటూ అనుకూలంగా కామెంట్స్ పెట్టిన వారు కూడా ఉన్నారు. ఇలా అటూ ఇటూ వాదోపవాదాలు జరుగుతూ సోషల్ మీడియాను ఊపేస్తున్న సమయంలో రజనీకాంత్ ఉత్తరాది పర్యటనలోనే ఉన్నారు.

ఆయన చెన్నై చేరుకున్న తరువాతనే ఈ విషయం మీద నోరు విప్పారు. తాను యోగులను గౌరవిస్తారు అంతే తప్ప వారి వయసు ఇతరాలు ఏవీ చూడను అంటూ కచ్చితంగా ఖండితంగా సూపర్ స్టార్ లెవెల్ లోనే రజనీకాంత్ చేసిన కామెంట్స్ ఇపుడు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి. అయితే రజనీకాంత్ ఇచ్చిన వివరణతో అయినా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేక ఇంకా ట్రోల్స్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.