Begin typing your search above and press return to search.

“అన్‌ హ్యాపీ లీవ్‌”... ఉద్యోగులకు కంపెనీ డిఫరెంట్ ఆఫర్!

ఇందులో భాగంగా... తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల డిఫరెంట్ టైప్ లో లీవ్‌ ఆఫర్‌ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   12 April 2024 12:40 PM GMT
“అన్‌  హ్యాపీ లీవ్‌”... ఉద్యోగులకు కంపెనీ డిఫరెంట్  ఆఫర్!
X

ఈ మధ్యకాలంలో.. ప్రధానంగా కోవిడ్ తదనంతర కాలంలో ఉద్యోగులకు పలు కంపెనీలు ఆసక్తికరమైన ఆఫర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ కంపెనీ మధ్యాహ్నం కాసేపు కునుకు తీసే ఆఫర్ ఇచ్చిందని ఒక చోట పోస్ట్ కనిపిస్తే... మరో కంపెనీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే కంపెనీలో పనిచేస్తే మరికొన్ని ఆఫర్లు ఇచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో మనసు బాగాలేని ఉద్యోగులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది మరో కంపెనీ!

అవును... చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఒక ఆసక్రికరమైన ఆఫర్ ఇచ్చింది. ఇందులో భాగంగా... తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల డిఫరెంట్ టైప్ లో లీవ్‌ ఆఫర్‌ ఇచ్చింది. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు కోరవచ్చని తెలిపారు. పైగా ఈ తరహాలో లీవ్ ను అప్లై చేసినప్పుడు మేనేజ్మెంట్‌ కుదరదని చెప్పడానికి వీల్లేదని షరతు కూడా విధించారు. దీంతో... ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాళ్లోకి వెళ్తే... సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్‌ సూపర్ మార్కెట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ యు డాంగ్లాయ్ తాజాగా తమ కంపెనీలోని ఉద్యోగులకు ఒక ఆఫర్ ప్రకటించారు. ఇందులో భాగంగా... ప్రతీ ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండటంవల్ల వారి మనసు బాగోలేకపోతే సెలవు తీసుకోవచ్చని అన్నారు.

ఇక ఇలాంటి సెలవుల వల్ల వారు తమ మనసును తేలిక పరుచుకొని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... రోజుకు ఏడు గంటలు మాత్రమే పని చేయాలని.. వారాంతాల్లో సెలవులు ఉండాలని.. 30 నుంచి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలని.. అందువల్ల తమ ఉద్యోగులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటారు.. ఫలితంగా కంపెనీ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

దీంతో ఈ విషయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా... "ఇంత మంచి బాస్ కూడా ఉంటారా?.. ఈ కార్పొరేట్ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ప్రచారం చేయాలి" అని ఒకరు స్పందిస్తే... "నేను నా ఉద్యోగం మానేసి పాంగ్ డాంగ్ లాయ్‌ మార్కెట్‌ లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను" అని మరొకరు స్పందించారు!

కాగా... పాంగ్ డాంగ్ లై సూపర్‌ మార్కెట్‌ లో పని చేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు! అంటే... ఇండియన్ కరెన్సీలో సుమారు 81 వేల రూపాయలు అన్నమాట! ఈ క్రమంలో తాజాగా "అన్‌ హ్యాపీ లీవ్‌" కింద ఏడాదిలో 10 రోజుల ప్రత్యేక సెలవులను సంస్థ ఇస్తుంది. రెగ్యులర్ హాలిడేస్ మామూలే!