సగం భారతం కరవు తాండవం...ఎల్ నినో ఎఫెక్ట్ !
దేశంలో పన్నెండు రాష్ట్రాలు అంటే సగం భారతం అన్న మాట. ఈ రాష్ట్రాలు అన్నీ కూడా రానున్న కాలంలో తీవ్రమైన కరవు కాటకాలతో అల్లాడుతాయని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
By: Satya P | 19 Jun 2026 5:00 AM ISTదేశంలో పన్నెండు రాష్ట్రాలు అంటే సగం భారతం అన్న మాట. ఈ రాష్ట్రాలు అన్నీ కూడా రానున్న కాలంలో తీవ్రమైన కరవు కాటకాలతో అల్లాడుతాయని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అనావృష్టితో పంటలు పండక పొలాలు బీడు బారిన పరిస్థితులు ఏర్పడుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది అంటే ఇదంతా ఎల్ నినో ప్రభావం అని అంటున్నారు. ఈ విధంగా ఎల్ నినో మీద పడి తీవ్రమైన కరవుని తెచ్చే ఆ పన్నెండు రాష్ట్రాలు ఏమిటి అంటే సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిందే మరి.
రెండు సీజన్లూ కూడా :
ఈసారి ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఎల్‌నినో ప్రభావం మామూలుగా ఉండదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసింది. అది సూపర్ ఎల్‌నినోగా మారే అవకాశం కూడా ఉందని తెలియచేస్తోంది. అంతే కాదు 2015 నాటి పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా కూడా వేస్తోంది. దాంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్ర ప్రభావం దేశం మీద కచ్చితంగా పడుతుందని కూడా పేర్కొంటోంది. ఇలా ఎల్ నినో ప్రభావంతో దేశంలో ఒక్కసారిగా పది శాతం వర్షపాతం తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో మాత్రమే కాకుండా శీతాకాలం పైన కూడా ఎల్ నినో ప్రభావం పడుతుందని అంటోంది. అంటే రబీ సీజన్ కి కూడా కరవు పరిస్థితులు కొనసాగుతాయా అన్న చర్చ మొదలైంది. ఈ రకమైన తీవ్రమైన వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఒక హెచ్చరికని సైతం జారీ చేసింది.
పన్నెండు రాష్ట్రాలు చూస్తే :
ఇక ఖరీఫ్ సీజన్‌లో తీవ్రమైన ఎల్ నినో ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉన్న పన్నెండు రాష్ట్రాలను భారత వ్యవసాయ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఈ రాష్ట్రాల పరిధిలోని 326 జిల్లాలకు ఎల్ నినో అధిక ముప్పు ఉన్నట్లుగా కూడా తేల్చింది. ఇలా ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉన్నాయని గుర్తించబడిన రాష్ట్రాల జాబితా చూస్తే కనుక ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుగా పేర్కొంది. ఈ రాష్ట్రాలలో వ్యవసాయాన్ని కాపాడేందుకు భారత వాతావరణ శాఖ వాతావరణ అంచనాలకు అనుగుణంగా జిల్లా స్థాయి అత్యవసర ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఆయా రాష్ట్రాలలో వర్షాభావాన్ని తట్టుకునే విధంగా కరువును అధిగమించే విధంగా ప్రత్యామ్నాయ పంటలను వేయాలని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ తో రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది.
