Begin typing your search above and press return to search.

అది 'బ్లడ్' మనీ.. పాక్ ఆటగాడిని కొన్న సన్ రైజర్స్ పై ఆగ్రహజ్వాల

ఈ వివాదం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ వాదనలను వినిపిస్తున్నారు.

By:  A.N.Kumar   |   17 March 2026 10:34 AM IST
అది బ్లడ్ మనీ.. పాక్ ఆటగాడిని కొన్న  సన్ రైజర్స్ పై ఆగ్రహజ్వాల
X

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్' లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు తీసుకున్న ఒక నిర్ణయం పెను వివాదానికి దారి తీసింది. భారతీయ వ్యాపారవేత్త.. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను తన జట్టులోకి తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్రీడలకూ, దేశభక్తికి మధ్య ఉన్న సన్నని గీతపై ఈ నిర్ణయం మరోసారి పెద్ద చర్చను లేవనెత్తింది.

సునీల్ గవాస్కర్ తీవ్ర అభ్యంతరం

ఈ వ్యవహారంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అత్యంత కఠినంగా స్పందించారు. 2008 ముంబై దాడుల తర్వాత భారత్ , పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆటగాళ్లపై ఉన్న అప్రకటిత నిషేధాన్ని ఆయన గుర్తు చేశారు. "భారతీయ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌లలో పెట్టుబడులు పెట్టినప్పుడు.. ఆ ఆదాయం మెజారిటీ భాగం భారతీయ ప్రేక్షకుల నుంచే వస్తుంది. భారతీయుల కష్టార్జితం నుంచి వచ్చిన డబ్బును పాకిస్తాన్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లించడం ఎంతవరకు సమంజసం?" అని గవాస్కర్ నిలదీశారు. భారతీయ అభిమానుల భావోద్వేగాలను పక్కన పెట్టి, కేవలం గెలుపే లక్ష్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కోచ్ డానియల్ వెటోరిపై విమర్శల బాణాలు

ఈ ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన జట్టు హెడ్ కోచ్ డానియల్ వెటోరిని కూడా గవాస్కర్ వదలలేదు. మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా, ఒక జట్టుగా దేశ ప్రయోజనాలను, ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కోచ్‌పై ఉంటుందని గవాస్కర్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ విమర్శలపై కోచ్ వెటోరి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. "నిజానికి మేము మొదట ఒక ఇంగ్లాండ్ స్పిన్నర్‌ను తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆటగాళ్ల లభ్యత, జట్టు కాంబినేషన్, టోర్నీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఇది కేవలం సాంకేతికపరమైన నిర్ణయం మాత్రమే" అని ఆయన పేర్కొన్నారు.

రెండుగా చీలిపోయిన సోషల్ మీడియా

ఈ వివాదం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ వాదనలను వినిపిస్తున్నారు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని, ప్రతిభ ఎక్కడున్నా గౌరవించాలని వీరు అభిప్రాయపడుతున్నారు.

దేశ భద్రత, అమరవీరుల త్యాగాల ముందు క్రీడలు పెద్దవి కావు. భారతీయ యాజమాన్యంలో ఉన్న జట్టు పాక్ ఆటగాళ్లకు వేదిక కల్పించడం దేశ ప్రయోజనాలకు విఘాతమని వీరు వాదిస్తున్నారు.

సన్‌రైజర్స్ లీడ్స్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక లీగ్ మ్యాచ్‌కే పరిమితం కాకుండా.. ఒక నైతిక ప్రశ్నగా మారింది. విదేశీ గడ్డపై జరిగే లీగ్ అయినప్పటికీ భారతీయ మూలాలున్న జట్లు తీసుకునే నిర్ణయాలు కోట్ల మంది భారతీయులపై ప్రభావం చూపుతాయి. కావ్యా మారన్ నాయకత్వంలోని మేనేజ్మెంట్ ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుంది? ఈ వివాదం సన్‌రైజర్స్ బ్రాండ్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.