సన్నీలియోన్.. శాండిల్ వుడ్ నటులకు షాకిచ్చిన కర్ణాటక సీఐడీ
కర్ణాటక సీఐడీ జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో సన్నీ లియోన్ పేరు రావటంతో జాతీయ మీడియాను ఈ కేసు ఆకర్షించింది.
By: Garuda Media | 9 Jun 2026 9:50 AM ISTఅవును.. ప్రముఖ నటి సన్నీ లియోన్ కు అనూహ్య రీతిలో కర్ణాటక సీఐడీ నుంచి నోటీసులు అందుకున్నారు. ఆ మాటకు వస్తే ఆమెకు మాత్రమే కాదు.. శాండిల్ వుడ్ కు చెందిన పలువురు నటీనటులకు నోటీసులు అందుతున్నాయి. కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ జరిగిన భారీ స్కాంలో భాగంగా వీరికి నోటీసులు అందాయి. అలా అని వారు మోసం కేసులో నిందితులు కానే కాదు. కాకుంటే.. వేలాది మందిని మోసం చేసిన వ్యక్తి నుంచి బ్యాక్ డోర్ లో డబ్బులు అందుకున్నందుకు వారు ఇప్పుడు నోటీసుల తిప్పలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కర్ణాటకలో సంచలనంగా మారిన శివం అసోసియేట్స్ డిపాజిట్ స్కాం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకతో పాటు.. మహారాష్ట్రలోనూ దీని బాధితులు ఉండటంతో ఈ కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం సీఐడీకి అప్పజెప్పింది.
ప్రజలు కష్టపడి సంపాదించి.. జాగ్రత్తగా పొదుపు చేసుకున్న డబ్బుల్ని ఎక్కువ వడ్డీ ఆశతో వల వేసి భారీగావారి నుంచి డిపాజిట్ల రూపంలో తీసుకోవటమే కాదు.. ఆ ధనాన్ని తనకున్న సినిమా పిచ్చితో పాటు.. ఇతర వ్యాపారాల్లో పెట్టిన పెద్దమనిషి కారణంగా.. వేలాది మంది ఇప్పుడు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సన్నీ లియోన్ తో పాటు పలువురు సెలబ్రిటీలకు.. నటీనటులకు కర్ణాటక సీఐడీ నోటీసులు జారీ చేసింది.
కర్ణాటకలోని బెళగావి.. బాగల్ కోట్.. హుబ్బళ్ళి ప్రాంతాలకు చెందిన దాదాపు 45 వేల మంది పేద, మధ్యతరగతి ప్రజల నుంచి కళ్లు చెదిరే వడ్డీ రేట్లతో శివానంద నీలణ్ణవర్ ఆఫర్ చేసి వందల కోట్లు వసూలు చేశారు. కర్ణాటక సీఐడీ పోలీసుల అంచనా ప్రకారం సుమారు రూ.4500 కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్లుగా గుర్తించారు. కేవలం 25 నెలల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు రెట్టింపు మొత్తం ఇస్తానన్న ఆశతో పాటు.. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేసి.. వేలాది మంది వద్ద నుంచి వందల కోట్లు వసూలు చేశాడు.
అతడి మాటలు.. హంగామా.. హడావుడి చూసిన ప్రజలు అతడి సంస్థలో భారీగా పెట్టుబడులుపెట్టాడు. దిగువ మధ్యతరగతి నుంచి ఎదిగిన శివానంద్ కు సినిమాలంటే పిచ్చి. ప్రజలు తన వద్ద దాచుకున్న డబ్బుల్ని ఛాంపియన్ అనే కన్నడ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం.. క్రేజ్ కోసం ఒకప్పటి అడల్ట్ నటి సన్నీ లియోన్ తో స్పెషల్ సాంగ్ కోసం రప్పించారు. ఆ మూవీలో ఒక్క పాట కోసం ఏకంగా సన్నీ లియోన్ కు రూ.కోటి రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే.. నగదు బదిలీ మొత్తం బ్యాంక్ అకౌంట్ల ద్వారానే జరిగినప్పటికి.. వాటికి సంబంధించిన వివరాల్ని క్రాస్ చెక్ చేసే పనిలో భాగంగా ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమెకు జరిపిన చెల్లింపుల వివరాలు అందించాలని కోరారు.
షాకింగ్ నిజం ఏమంటే.. సీఐడీ అధికారులు శివం అసోసియేట్స్ కు చెందిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా పలువురు అమాయక ప్రజలు.. ఏజెంట్ల మాటలు విని దాదాపు రూ.170 కోట్లు ఆ సంస్థ అకౌంట్లో డిపాజిట్ చేయటం గమనార్హం. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ములో దాదాపు రూ.200 కోట్ల వరకు స్టాక్ మార్కెట్ లో పెట్టి నష్టపోయినట్లుగా చెబుతున్నారు. గత ఏడాది డిసెంబరులో బెళగావిలో కన్నడ ఉత్సవం పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి.. పలువురు కన్నడ స్టార్ హీరోలు.. హీరోయిన్లను రప్పించి వారికి ఖరీదైన బహుమతులు ఇచ్చారు. ఇవన్నీ ప్రజల సొమ్ములతోనే చేయటం గమనార్హం.
కర్ణాటక సీఐడీ జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో సన్నీ లియోన్ పేరు రావటంతో జాతీయ మీడియాను ఈ కేసు ఆకర్షించింది. త్వరలో నోటీసులు అందుకునే సనీ నటుల జాబితా ఇదేనని పోలీసు వర్గాలనుంచి తమకు సమాచారం అందినట్లుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేస్తున్నాయి. వారిలో పుష్ప మూవీలో జాలిరెడ్డి పాత్ర పోషించిన డాలి ధనుంజయ, వశిష్ఠ సింహా (నారప్ప, కేజీఎఫ్ మూవీల్లో నటించారు), కాంతారా మూవీ హీరోయిన్ సప్తమీ గౌడ, రాగిణి ద్వివేది తదితరులు ఉన్నారు.
ప్రజలు భారీగా మోసం చేసిన కేసులో శివానంద్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు విచారణలో అతడి లీలలు వెలుగు చూశాయి. ఆ వివరాల్ని తెలుసుకున్న వారంతా విస్మయానికి గురవుతున్నారు. ప్రజలకు మోసం మాటలు చెప్పి భారీగా డిపాజిట్లు సేకరించిన అతను అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లుగా గుర్తించారు. అంతేకాదు ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల నుంచి రూ.55 కోట్ల భారీ మొత్తం శివానంద వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు మళ్లించినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు.
కర్ణాటకలో వందల కోట్ల మొత్తాన్ని అమాయక ప్రజల నుంచి వసూలు చేసిన ఇతను.. తన మోసాన్ని మహారాష్ట్రకు వ్యాపించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఆదిత్యరాజ్ క్యాపిటల్ వంటి అనుబంధ సంస్థల్ని.. ఏజెంట్లను రంగంలోకి దించాడు. ఇంత భారీగా మోసానికి కారణమైన శివానందతో పాటు.. ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో యాప్ ను తయారు చేసిన డెవలపర్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాంక్ అకౌంట్లు మొదలు.. అతడి ఆస్తుల్ని..ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. అతడి మోసం మాటల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి వారు మదుపు చేసిన డబ్బులు ఎప్పటికి అందుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
