మళ్లీ కోర్టుకు వైఎస్ సునీత.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా లేదని, కొన్ని కోణాలను దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదని సునీత గతంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
By: Tupaki Political Desk | 13 April 2026 2:43 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ హత్య కేసు దర్యాప్తు ముగిసినట్లేనని సీబీఐ చెబుతుండగా, తమకు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయని, ప్రధానమైన అంశాలను దర్యాప్తు సంస్థ విస్మరించిందని, ఆయా అంశాలపై విచారణ కొనసాగించాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుందని చెబుతున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసిందని ఇప్పటికే సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కేసు మళ్లీ విచారించాలని కోరుతూ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఈ విషయంలో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా లేదని, కొన్ని కోణాలను దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదని సునీత గతంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సునీత పిటిషన్ ను పరిశీలించి తగిన ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టును గతంలో ఆదేశించింది. ఈ క్రమంలో కేసులో ఇద్దరు వ్యక్తులకు చెందిన మొబైల్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు సూచనలతో దర్యాప్తు జరిపిన సీబీఐ తుది నివేదిక ఇచ్చింది. కొత్తగా ఎవరికి కేసుతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని తేల్చిచెప్పింది.
అయితే ఈ నివేదికపైనా సునీత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తాజా పిటిషన్ తో వెల్లడైందని అంటున్నారు. వివేకా హత్యకు సంబంధించి కీలకమైన కొన్ని అంశాల జోలికి దర్యాప్తు సంస్థ వెళ్లడం లేదని సునీత ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా సమగ్ర దర్యాప్తు కావాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ట్రయల్ కోర్టు పాక్షిక విచారణకు మాత్రమే అనుమతించిందని, అందువల్ల కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించలేదని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నట్లు చెబుతున్నారు.
సునీత తన పిటిషన్ లో సంచలన ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమ సందేహాలకు సీబీఐ దర్యాప్తులో సమాధానం లభించలేదని తన పిటిషన్ లో కీలక విషయాలను ప్రస్తావిస్తూ అనుమానాలు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తన తండ్రి హత్యకు సంబంధించి అనుమానాస్పద అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని సునీత తన పిటిషన్ లో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, కేసులో ఇంకా స్పష్టత లేని అంశాలపై మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించాలంటూ ఆమె హైకోర్టును అభ్యర్థించారని అంటున్నారు.
