సుప్రీం చారిత్రాత్మక తీర్పు ఎలాంటిదో వివరించిన ప్రజ్వల సునీతా కృష్ణన్
సె*క్స్ వర్కర్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పును ఇవ్వటం తెలిసిందే.
By: Garuda Media | 5 Jun 2026 2:30 PM ISTసె*క్స్ వర్కర్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పును ఇవ్వటం తెలిసిందే. దీనికి కారణం.. హైదరాబాద్ కు చెందిన ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ 22 ఏళ్ల క్రితం దాఖలు చేసిన పిటషన్ కు ఫలితంగా చెప్పాలి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు.. విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి వివరించే ప్రయత్నం చేశారు ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్. మహిళల అక్రమ రవాణా మీద.. మహిళలను వ్యభిచార కూపంలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తమ సంస్థ పోరాడుతోందన్నారు. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వటం తెలిసిందే.
మానవ అక్రమ రవాణా.. లైంగిక దోపిడీ బాధితుల రక్షణ.. పునరావాసంపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందన్న ఆమె.. ‘‘మా 22 ఏళ్ల పోరాటం ఫలించింది. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఈ కేసు వాదించిన న్యాయవాది అపర్ణ భట్ ఎంతగానో సహకరించారు. అక్రమ రవాణా బాధితురాలికి తప్పనిసరిగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మార్గదర్శకాల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం పొందుపర్చటం మంచి విషయం’’అని చెప్పారు.
తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు 32, 400 మంది అమ్మాయిలని రెస్క్యూ చేశామని.. వీరిలో చాలామంది ఈ సమాజం.. పోలీసులు.. ఇతర వ్యవస్థల ద్వారా మరింతగా బాధ పడుతూనే ఉందన్నారు. ‘‘ఇక్కడి బాధల్ని భరించలేక మళ్లీ తిరిగి ఆ అంధకారంలోకి వెళ్లారు. విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ అనే చట్టం రావాలని మేం పోరాడాం. గత 22 ఏళ్లుగా నిరంతరంగా పోరాటం చేస్తే గత వారం చరిత్రాత్మక తీర్పు వచ్చింది. ఇది విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్, పార్లమెంట్ ఆమోదించిన తరువాత చట్టంగా మారుతుంది. ఇందులో మూడు విషయాలు క్లియర్‌గా ఉంటాయి. ఆర్టికల్ 21, 23 ప్రకారం.. ప్రతీ ఒక్క బాధితురాలికి రిహాబిలిటేషన్ అనేది ప్రాథమిక హక్కు. బాధితురాలికి డిగ్నిటీ ఉండటం. అమ్మాయిని సరుకులా అమ్మకూడదు, గౌరవప్రదంగా, అర్థవంతంగా బతికేలా వనరులు కల్పించడం అనే అంశాలు ముఖ్యంగా ఉంటాయి. . ప్రతీ దశలో అంటే పునరావాసం కావాలా? రిహాబిలిటేషన్ సెంటర్‌కి రావడం అంగీకారమేనా? ఇలా ప్రతీ సారి అమ్మాయి కన్సంట్ తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఉందని.. కానీ వారికి ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. ప్రొటెక్షన్ ప్లాన్‌లో ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఓ యూనిట్‌ను పెట్టమని ఉంటుందని.. రెస్క్యూ నుంచి రీహాబిలిటేషన్ వరకు ప్రతీదీ అకౌంటబిలిటీ ఉండాలని పేర్కొన్నారు. ‘‘రెస్క్యూ సమయంలో పోలీసులు తప్పుగా బిహేవ్ చేస్తే కేసు కూడా ఫైల్ చేయవచ్చు. విక్టిమ్‌కి ఒక లాయర్ ఉండాలి, రైట్ టు లీగల్ రిప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. బాధితురాలికి నష్టపరిహారం అనే తీర్పు ఇంత వరకు రాలేదు. ఇలాంటి ఓ తీర్పు రావడం దేశంలో ఇదే మొదటి సారి’’ అని చెప్పారు.
ఈ తీర్పు సందర్భంగా కోర్టు కొన్ని రికమండేషన్స్ కూడా చేసిందన్నారు. ‘‘అక్రమ రవాణా పైన సమగ్రమైన చట్టం తీసుకురావాలి. టెక్నాలజీ ద్వారా జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ను అడ్డుకోవడానికి ఏం చెయ్యాలి అని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పింది. వ్యభిచారం స్వేచ్చగా చేస్తున్న వారు.. బలవంతంగా చేస్తున్న వారున్నారు.. వీటి డెఫినిషన్ క్లియర్‌గా చెప్పాలని అన్నది. రెస్క్యూ ఆపరేషన్‌లో అందరిని బాధితురాలుగా చూడాలి.. నేరస్తులుగా చూడకూడదు’’ అని పేర్కొన్నట్లుగా వెల్లడించారు.
