Begin typing your search above and press return to search.

ఎంపీ కావాలన్న కోరిక నాలుగోసారి అయినా తీరేనా.....!?

ఆయన గత మూడు ఎన్నికల నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు. అది కూడా ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ నుంచి. తమాషా ఏంటి అంటే ఆయన పోటీ చేసిన ప్రతీ సారి గెలుపు గుర్రం ఎక్కడం లేదు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 7:30 AM GMT
ఎంపీ కావాలన్న కోరిక నాలుగోసారి అయినా తీరేనా.....!?
X

ఆయన గత మూడు ఎన్నికల నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు. అది కూడా ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ నుంచి. తమాషా ఏంటి అంటే ఆయన పోటీ చేసిన ప్రతీ సారి గెలుపు గుర్రం ఎక్కడం లేదు. అంతే కాదు ఆయన పోటీ చేస్తున్న పార్టీ కూడా అధికారంలోకి రావడంలేదు.

ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్‌. తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖుడిగా ఉన్న సునీల్ 2009లో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆనాడు ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండు లక్షల తొంబై వేల ఓట్లను తెచ్చుకున్నారు. రెండవ స్థానంలో నిలిచారు.

ఇక 2014 నాటికి ఆయన వైసీపీలోకి మారారు. ఆ పార్టీ తరఫున కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అయిదు లక్షల పదకొండు వేల దాకా ఓట్లు వచ్చాయి. ఎంత బ్యాడ్ లక్ అంటే జస్ట్ మూడున్నర వేల స్వల్ప ఓట్ల తేడాతో సునీల్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.

ఆ తరువాత 2019 ఎన్నికల్లో సునీల్ టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు మళ్లీ అయిదు లక్షల పన్నెండు వేల దాకా ఓట్లు వచ్చాయి. పాతిక వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. దాంతో హ్యాట్రిక్ ఓటమి వీరుడిగా పేరు తెచ్చుకున్నారు

ఏపీలో ప్రధాన పార్టీలు అన్నీ చూశారు. ఒకే సీటు నుంచి మూడు సార్లు పట్టువదలని విక్రమార్కుడిగా పోటీ చేస్తూ ఓటమి చెందారు. ఈసారి మాత్రం ఆయన పోటీకి దూరంగా ఉంటారని వార్తలు వచ్చాయి. అంతే కాదు అసెంబ్లీ సీటు ఇస్తే పోటీ చేస్తాను అని వైసీపీ నేతలకు చెప్పినట్లుగా కూడా ప్రచారం జరిగింది.

అయితే తాజాగా అందుతున్న వార్తలను బట్టి చూస్తే ఆయన నాలుగవ సారి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అలా తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.

ఇక ఆయన మీద పోటీకి టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్ధి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అలా జనసేన నుంచి ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్‌ బాబు పోటీలో ఉంటారనే ప్రచారం అయితే సాగుతోంది. మరోవైపు టిడిపికి సీటు కేటాయిస్తే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారని అంటున్నారు.

ఈ విషయంలో టిడిపి-జనసేన కలసి కూర్చుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అయితే జనసేనకే ఈ సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. జనసేన 2019లో లక్షా ముప్పయి రెండు వేల ఓట్లను తెచ్చుకుంది.

ఈసారి పొత్తు ఉంటే టీడీపీకి అపుడు వచ్చిన అయిదు లక్షల 12 వేల ఓట్లు కలుపుకుంటే కచ్చితంగా మంచి మెజారిటీతో కూటమి గెలుస్తుందని లెక్క వేస్తున్నారు. అయితే రెండూ రెండూ ఎపుడూ నాలుగు కావు రాజకీయాల్లో అని వైసీపీ నేతలు అంటున్నారు. వీటికి మించి చలమలశెట్టి సునీల్ లక్ ఎలా ఉందో ఈ ఎన్నికల్లో చూడాలని అంటున్నారు.