రఘురామ కేసులో ట్విస్ట్.. బిహార్ లో ఏపీ పోలీసులకు ఝలక్!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది.
By: Tupaki Political Desk | 24 Feb 2026 1:12 PM ISTడిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ6గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఏపీ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ట్రాన్సింట్ వారెంట్ పై ఏపీకి తీసుకురావడానికి ఏపీ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే బిహార్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు వారెంట్, కేసు డైరీ చూకుండా నిందితుడు సునీల్ నాయక్ ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు వారెంట్ జారీకి నిరాకరించినట్లు చెబుతున్నారు. ఇక నిందితుడు సునీల్ నాయక్ అరెస్టు సందర్భంగా సోమవారం పట్నాలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ గత ప్రభుత్వంలో డిప్యుటేషన్ పై ఏపీలో పనిచేశారు. సీఐడీ డీఐజిగా ఆయన పనిచేసిన సమయంలో నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అరెస్టు జరిగింది. ఆ సమయంలో రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగినట్లు 2024లో కేసు నమోదైంది.
ప్రస్తుతం బిహార్ లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బిహార్ రాజధాని పట్నా వెళ్లింది. ఈ బృందంలో గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ రమణకుమార్, వెస్ట్ డీఎస్పీ అరవింద్, నగరంపాలెం సీఐ సత్యనారాయణ, మరో ఇరువురు సిబ్బంది ఉన్నారు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇంటికి వెళ్లిన ఎస్పీ దామోదర్ బృందం ఆయనను అరెస్టు చేస్తున్నట్లు నోటీసు అందజేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీసుస్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టుచేస్తున్న నిందితుడు సునీల్ నాయక్ తల్లికి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అయితే నిందితుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లకుండా బిహార్ హోంగార్డు విభాగానికి చెందిన కొందరు సిబ్బంది అడ్డుకున్నట్లు ఏపీ పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఓ సీనియర్ అధికారిణి సైతం వచ్చి ఏపీ పోలీసులపై దుర్భాషలకు దిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పట్నా వెస్ట్ ఎస్పీ భానుప్రతాప్ సింగ్ కల్పించుకుని ఆందోళనకు దిగిన వారిని శాంతింపజేసి నిందితుడుని కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఒప్పించినట్లు సమాచారం. ఆ తర్వాత స్థానిక పోలీసుల సాయంతో నిందితుడు సునీల్ నాయక్ ను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కోర్టులో ట్రాన్సిట్ వారెంటు తీసుకుని సాయంత్రానికి విమానంలో ఏపీకి తెచ్చేందుకు రెడీ అయ్యారు.
అయితే కోర్టులో ఊహించని ట్విస్టు తగిలిందని చెబుతున్నారు. నిందితుడు సునీల్ నాయక్ ను పట్నాలోని 9వ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించారు. అంతరాష్ట్ర అరెస్టు విధానాలు పాటించలేదని, అరెస్టు వారెంటు లేదని, అవసరమైన పత్రాలు సమర్పించలేదన్న కారణాలు చూపుతూ న్యాయాధికారి ట్రాన్సిట్ వారెంట్ పిటిషన్ ను తిరస్కరించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ లో నిందితుడు పేరు లేకుండా, అరెస్టు వారెంటు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని మేజిస్ట్రేట్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అయితే సునీల్ నాయక్ పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినా, ఆయన పాత్రకు సంబంధించి ఆధారాలు, సాక్ష్యులు, ఇతర నిందితుల నుంచి తీసుకున్న 161, 164 వాంగ్మూలాలను ఏపీ పోలీసులు కోర్టుకు సమర్పించినా న్యాయమూర్తి ట్రాన్సిట్ వారీ జారీ చేయలేదని అంటున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాల్సివున్నా, బిహార్ మేజిస్ట్రేట్ నిరాకరించారని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా నెల రోజుల వరకు సునీల్ నాయక్ పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో బిహార్ కు చెందిన సుమారు ఐదారు వందల మంది పోలీసులు కోర్టును చుట్టుముట్టి ఏపీ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సునీల్ నాయక్ ను తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వనందున సునీల్ నాయక్ ను తమతో తీసుకువెళుతున్నామని అదనపు డీజీ స్థాయి అధికారి ఒకరు చెప్పినట్లు ఏపీ పోలీసులు ఇక్కడికి సమాచారమిచ్చారు.
మరోవైపు ఏపీ పోలీసులపై ఐజీ సునీల్ నాయక్ పట్నాలోని శాస్త్రినగర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. తనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు వారెంటు చూపలేదని, అంతరాష్ట్ర అరెస్టుకు ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని, అరెస్టు తర్వాతే శాస్త్రినగర్ పోలీసుస్టేషన్ కి తెలియజేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసుల చర్యలతో 66 ఏళ్ల తన తల్లి ఎం.బీకీబాయి తీవ్ర ఆందోళనకు గురయ్యారని, ఆమె గది తలుపులకు తాళం కూడా వేశారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. ఇక హైకోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని సునీల్ నాయక్ ను ఏపీకి తీసుకువద్దామన్న ఏపీ పోలీసుల వ్యూహం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది. స్థానిక కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో ఏపీ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక్కటే ఏపీ పోలీసులు ముందున్న ప్రత్యామ్నాయంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.
