Begin typing your search above and press return to search.

బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్ పై ప్రశ్నల వర్షం.. ఇంతకు ఏం అడిగారంటే?

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ కేసులో సునీల్ నాయక్ పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   6 March 2026 6:31 PM IST
బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్ పై ప్రశ్నల వర్షం.. ఇంతకు ఏం అడిగారంటే?
X

బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను గుంటూరు సీసీఎస్ లో రెండో రోజు విచారించారు. దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు అధికారుల బృందం సునీల్ నాయక్ ను పలు ప్రశ్నలను అడిగినట్లు చెబుతున్నారు. గురువారం కూడా సునీల్ నాయక్ ను సుమారు ఐదు గంట పాటు ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు. హైకోర్టు సూచనల మేరకు సిట్ అధికారుల ముందు విచారణకు సునీల్ నాయక్ హాజరయ్యారు. విచారణలో ఆయన ఏం చెప్పారనే అంశమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ కేసులో సునీల్ నాయక్ పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన అరెస్టుకు ఏపీ పోలీసులు ప్రయత్నించడం, బిహార్ పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ క్రమంలో హైకోర్టులో సునీల్ నాయక్ ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 9వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో పోలీసులకు సహకరించాల్సిందిగా సునీల్ నాయక్ ను ఆదేశించింది. దీంతో కొన్నాళ్లుగా విచారణ నుంచి తప్పించుకుంటున్న సునీల్ నాయక్ సిట్ పోలీసుల ఎదుట హాజరుకావాల్సి వచ్చిందని అంటున్నారు.

ఇక గురువారం మొదలైన విచారణ రెండో రోజు కొనసాగింది. తొలిరోజు దాదాపు ఐదు గంటలు ప్రశ్నించారు. శుక్రవారం కూడా దాదాపు అంతే సమయం విచారించారు. ఎక్కువగా కేసుకు సంబంధించిన ప్రశ్నలను సంధించిన విచారణాధికారి, బిహార్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ కు రావడంపైనా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఎవరి సహకారంతో ఏపీకి డిప్యుటేషన్ వేయించుకున్నారు? ఏ అవసరం మేరకు వచ్చారు అన్న ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు.

అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై ఎవరి ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకువచ్చిన తర్వాత డాక్టర్ ను ఎందుకు పిలిపించారన్న అన్న విషయాలపైనా ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు. రఘురామ కేసులో సునీల్ నాయక్ విచారణ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దాదాపు ఏడాదిన్నరగా సునీల్ నాయక్ విచారణకు ఏపీ పోలీసులు ఎదురుచూశారు. ఎట్టకేలకు హైకోర్టు ఉత్తర్వులతో ఆయన విచారణాధికారుల ముందు హాజరయ్యారు. ఇక పరిణామానికి ముందు తన అరెస్టు, అక్రమంగా కేసులో ఇరికించారంటూ సునీల్ నాయక్ ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం రేపింది. సునీల్ నాయక్ విచారణ తర్వాత సిట్ నెక్ట్స్ స్టెప్ ఏంటి అన్న చర్చ సాగుతోంది.