జగన్ ని కలిసింది తక్కువ... టార్గెట్ అయ్యాను !
మాజీ ఐఏఎస్ అధికారి సునీల్ కుమార్ ఒక తెలుగు మీడియా చానల్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Satya P | 3 May 2026 12:00 AM ISTమాజీ ఐఏఎస్ అధికారి సునీల్ కుమార్ ఒక తెలుగు మీడియా చానల్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా టార్గెట్ చేశారు అని అన్నారు. ఒక తెలుగు టీవీ ఛానల్ నిర్వహించిన వీకెండ్ కార్యక్రమం క్రాస్ ఫైర్ ఆయన మాట్లాడుతూ తాను చట్టబద్ధంగానే తన విధులను నిర్వహించానని చెప్పారు. తాను ఎవరి మీద చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని అక్రమ అరెస్టులు చేయలేదని స్పష్టం చేశారు. కానీ రాజకీయంగా మాత్రం తాను తనలాంటి అధికారులు టార్గెట్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.
రెండు రాజకీయ వ్యవస్థలు :
ఏపీ రాజకీయం పూర్తిగా రెండు రాజకీయ వ్యవస్థలుగా చీలిపోయిందని దీంతో అతి సున్నితమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. తాము చట్ట ప్రకారం పనిచేసినా మరో వైపు ఉన్న వారికి అది రాజకీయ అస్త్రంగా మారుతోందని అన్నారు. పైగా రాజకీయాలు అంటేనే ఈ విధంగా చేసే వైఖరి ఉందని కూడా సునీల్ కుమార్ చెప్పారు. ఈ విధమైన రాజకీయ పరిస్థితుల వల్ల తనతో పాటు చాలా మంది అధికారులు నలిగిపోతూ వచ్చారని ఆయన అన్నారు.
జగన్ తో భేటీ :
తాను ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా కొన్ని కీలకమైన ఇష్యూల గురించి బీఫింగ్ ఇచ్చేటపుడు సీఎం గా జగన్ ఉన్నపుడు కలిశాను అని సునీల్ కుమార్ చెప్పారు. అంతే తప్ప ఎవరిని అరెస్ట్ చేయాలి అన్న దాని మీద సీఎం తో చర్చించాను అన్నది అవాస్తవం అన్నారు. ఇక సీఎం విషయం తీసుకుంటే ఆయనకు ఎన్నో పనులు ఉంటాయని బిజీగా ఉంటారని చెప్పారు. కేవలం కొందరి అరెస్టుల గురించి చర్చించే తీరిక ఉండదని అన్నారు. అయినా సరే తాను అరెస్ట్ చేసిన వారిలో సీఎం గుర్తుపెట్టుకోవాల్సిన వారు ఎవరున్నారు అని సునీల్ కుమార్ ప్రశ్నించడం విశేషం.
సీఐడీ చట్టబద్ధంగానే :
ఏపీలో సీఐడీ చట్టబద్ధంగానే పనిచేస్తోందని తాను కూడా అలాగే చేశాను అని సునీల్ కుమార్ చెప్పారు. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం వారు తనను టార్గెట్ చేశారు అని అన్నారు. తాను ఎందుకు వారికి ఫేవరెట్ అయ్యాను అన్నది వారికే తెలియాలి అన్నారు. మన పని మనం చేస్తూ పోయినా అవతల వారు విమర్శించడం సహజం. ఇక క్యాడర్ కూడా పొలిటికల్ కెరీర్ కోసం ఎన్నో మాట్లాడుతారు అని ఆయన అన్నారు. ఎవరి విషయంలో అయినా తప్పుగా మాట్లాడినా వేరే విధంగా చర్యలు తీసుకున్నా కోర్టులు ఉన్నాయి కదా అక్కడే నిజాలు బయటకు వస్తాయని సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు. తాను మాత్రం పద్ధతిగానే వ్యవహరించాను అని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పడం విశేషం.
