150 చోరీల హైదరాబాదీ.. స్టార్ క్రికెటర్ మామ కమ్ హీరోకు వీరాభిమాని
హైదరాబాద్ పాత బస్తీ ఫలక్ నుమా నవాబా సాబ్ కుంట సంజయ్ గాంధీ నగర్ కు చెందిన మొహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి (51)ని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 13 April 2025 3:00 AM ISTఅతడో దొంగ.. ఓ అమ్మాయిని ప్రేమించాడు.. 16వ ఏటనే చోరీల బాట పట్టాడు.. మరో ప్రత్యేకత ఏమంటే.. అతడు స్టార్ క్రికెటర్ కు మామ కమ్ బాలీవుడ్ నటుడు అయిన సినీ హీరోకు వీరాభిమాని. ఎంతగా అభిమాని అంటే.. అతడి పేరును తన పేరుగా పెట్టుకునేంత.
హైదరాబాద్ పాత బస్తీ ఫలక్ నుమా నవాబా సాబ్ కుంట సంజయ్ గాంధీ నగర్ కు చెందిన మొహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి (51)ని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
ఫతేదర్వాజా కుమ్మర్ వాడీలో ఉండగా.. సలీం 16 ఏళ్ల వయసులో తమ కుటుంబానికి చెందిన కిరాణం దుకాణంలో పనిచేసేవాడు. అమ్మాయితో ప్రేమలో పడి దుకాణంలో చోరీలు చేశాడు. ఆ తర్వాత ఆమెతో జల్సాలు చేస్తూ చోరీలు చేస్తుండడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో ఇంట్లోంచి పారిపోయాడు.
కాగా, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కు మామ అయిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి మొహమ్మద్ సలీం వీరాభిమాని. అతడి సినిమాలు చూసి ఆరాధించడం మొదలుపెట్టాడు. చివరకు తన పేరును సునీల్ శెట్టిగానూ మార్చుకున్నాడు. ప్రస్తుతం 51 ఏళ్లున్న సలీం.. 18వ ఏట ఓ ఇంట్లో ఇత్తడి పాత్రల చోరీ కేసులో చాదర్ ఘాట్ పోలీసులకు దొరికి జైలుకెళ్లాడు. తిరిగొచ్చాక కూడా తన హస్తలాఘవం ఆపలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 చోరీలు చేశాడు మొహమ్మద్ సలీం. కేవలం చిన్న టార్చిలైటు, కటింగ్ ప్లేయర్ ను ఉపయోగించి దొంగతనాలు చేయడం సలీం ప్రత్యేకత. 25 సార్లు జైలుకెళ్లాడు. 2023 జూలైలో బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు.
హెలికాప్టర్ రైడ్ లతో జల్సా
చోరీ సొత్తుతో జల్సాలు చేయడం సలీం ప్రత్యేకత. ఎంతగా అంటే.. ముంబై, అజ్మేర్ తరచూ వెళ్లేవాడు. అక్కడ హెలికాప్టర్ రైడ్ లు చేసేవాడు. ఇక ఎంతో అభిమానించే సునీల్ శెట్టిని కలిసేందుకు ముంబై బాంద్రాలోని ఆయన నివాసానికి పలుసార్లు వెళ్లినా సాధ్యం కాలేదు. ఇదీ సలీం.. అలియాస్ సునీల్ శెట్టి ఘరానా దొంగతనాల కథ.
