Begin typing your search above and press return to search.

విశాఖ రేంజ్ మారిపోయింది.. సుందర్ పిచాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఏపీ ఆర్థిక శక్తి విశాఖపట్నంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   19 Feb 2026 1:19 PM IST
విశాఖ రేంజ్ మారిపోయింది.. సుందర్ పిచాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

ఏపీ ఆర్థిక శక్తి విశాఖపట్నంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశరాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న ఆయన భారత్ లో గూగుల్ కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించిన సుందర్ పిచాయ్ గ్రోత్ ఇంజిన్ గా మారిన విశాఖపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో పెట్టుబడులను ప్రస్తావించడమే కాకుండా విశాఖ త్వరలో ప్రపంచానికి గేట్ గా మారుతుందని ప్రకటించారు. సుందర్ పిచాయ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా విశాఖను అందమైన నగరంగా అభివర్ణించిన గూగుల్ బాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం నెట్టింట హాట్ డిబేట్ గా మారాయి.

విశాఖలో 15 వందల కోట్ల డాలర్లు అంటే రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్ మార్గానికి గేట్ వే కానుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. ‘ఏఐ టెక్నాలజీలో భారత్ అసాధారణ పథాన్ని కలిగి ఉండబోతోందని, ఆ ప్రయాణంలో గూగుల్ కూడా భాగస్వామ్యం పంచుకుంటోంది’ అని సుందర్ పిచాయ్ తెలిపారు. ఏఐలో భారత్ అద్భుత సామర్థ్యాలను కలిగి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెరికా-భారత్ కనెక్ట్ పై ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు.

భారత్-అమెరికా మధ్య ఏఐ అనుసంధాన్ని పెంచేందుకు సముద్రగర్భలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మార్గాలను వేయనున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ కేబుళ్లు విశాఖ డేటా సెంటర్ తో అనుసంధానిస్తారని అంటున్నారు. అమెరికా-భారత్ కనెక్ట్ ప్రాజెక్టులో భాగంగా గూగుల్ మన దేశం నుంచి సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య సముద్ర గర్భం నుంచి కొత్త కేబుల్ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ ఏఐ డేటా సెంటర్ దక్షిణాఫ్రికా, సింగపూర్ దేశాలతో అనుసంధానం అవుతుందని చెబుతున్నారు.

అదేవిధంగా ముంబై నుంచి దక్షిణ ఆస్ట్రేలియాకు కేబుల్ రూట్ ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ కేబుల్ మార్గాల వల్ల భారత్ తోపాటు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన ఏఐ మౌలిక వసతులను అమెరికాతో అనుసంధానిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా వైజాగ్ డేటా సెంటర్ అంతర్జాతీయ కేబుల్ గేట్ వేగా అవతరిస్తోంది. మరోవైపు ఏఐ గ్లోబల్ చాంపియన్ గా భారత్ ఆవిర్భవించనుందని కూడా గూగుల్ విశ్వసిస్తోంది. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మాట్లాడిన సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ తదుపరి ఏఐ దిగ్గజం భారత్ నుంచే పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.