లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో ఏ1 కేసిరెడ్డి పిటిషన్
హైదరాబాద్ నగర శివార్లలోని కాచారం గ్రామంలో సులోచన ఫార్మ హౌస్ లో సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
By: Tupaki Desk | 30 July 2025 8:25 PM ISTహైదరాబాద్ నగర శివార్లలోని కాచారం గ్రామంలో సులోచన ఫార్మ హౌస్ లో సిట్ స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. బుధవారం వేకువజామున ఏ40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో సులోచన ఫార్మ హౌస్ లో సిట్ తనఖీలు చేయగా, 12 అట్ట పెట్టెల్లో రూ.11 కోట్లు నగదు బయటపడిన విషయం తెలిసిందే. ఈ నగదు లిక్కర్ కేసులో వసూలు చేసిన కమీషన్ డబ్బేనంటూ సిట్ చెబుతోంది. ఏ1 కేసిరెడ్డి సూచన మేరకు ఏ12 చాణక్య, ఏ40 వరుణ్ కలిసి ఫాం హౌసులో రూ.11 కోట్లు దాచినట్లు చెబుతున్నారు.
అయితే సిట్ చెబుతున్నవన్నీ అబద్దాలేనని, తనకు బెయిలు రానీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగా ఫాం హౌసులో దొరికిన డబ్బు తనదిగా ప్రచారం చేస్తున్నారని ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదన్న కేసిరెడ్డి.. ఫాం హౌసు యజమాని తీగల విజయానందరెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయని, ఇంజనీరింగ్ కాలేజ్, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నట్లు తన పిటిషన్ లో చెప్పడంతో ఆయనపై అనుమానాలు తలెత్తేలా చేశారని అంటున్నారు.
వందల కోట్ల టర్నోవర్ ఉన్న విజయానందరెడ్డి యాజమాన్యంలో ఉన్న అరేట్ ఆస్పత్రిలో తన భార్యకు చిన్న వాటా మాత్రమే ఉందని కేసిరెడ్డి వెల్లడించారు. విజయానందరెడ్డితో అంతకుమించి సంబంధాలు లేవని తెలిపారు. కేసిరెడ్డి ఎదురు తిరగడంతో సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లు ఎవరిది అన్న చర్చ మొదలైంది. ఏ 40 ఇచ్చిన సమాచారంతో రూ.11 కోట్ల నగదు లిక్కర్ స్కాంలో కమీషన్ గా సేకరించిందే అని సిట్ చెబుతున్నప్పటికీ, ఆ విషయం ఆధారాలతో నిరూపించాల్సివుందని అంటున్నారు. ఫాం హౌసులో స్వాధీనం చేసుకున్న నగదు కేసిరెడ్డిదే అని నిరూపించే ఆధారాలను సిట్ కోర్టులో సమర్పిస్తేగానీ మిస్టరీ తేలేలా లేదని అంటున్నారు.
