రోడ్డు వేయడం లేదు.. ఒక హెలికాప్టర్ ఇప్పించండి..! హోం మంత్రి అమిత్ షాకు షాకింగ్ లెటర్..
సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోతే సామాన్యుడు ఏం చేస్తాడు? కొందరు ధర్నాలు చేస్తారు, మరికొందరు నిరసనలు తెలుపుతారు.
By: Tupaki Political Desk | 26 May 2026 2:53 PM ISTసమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోతే సామాన్యుడు ఏం చేస్తాడు? కొందరు ధర్నాలు చేస్తారు, మరికొందరు నిరసనలు తెలుపుతారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాకు చెందిన ఒక మారుమూల గ్రామ ప్రజలు మాత్రం ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి షాకింగ్ లేఖ రాశారు. ‘మాకు రోడ్లు వేయడం లేదు.. కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఊరు దాటడానికి ఒక హెలికాప్టర్ అయినా ఇవ్వండి’ అంటూ వారు వినూత్నంగా ఆలోచించి లేఖ రాశారు. గ్రామస్థులు తమ నిరసనను వ్యంగ్యంగా తెలియజేయడానికి హెలికాఫ్టర్ ఇవ్వాలని కోరడంతో ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ గా మారిపోయింది.
పదేళ్లుగా నరకం
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా మారుకి గ్రామస్థుల దశాబ్ద కాలంగా రోడ్డు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హోంమంత్రి అమిత్ షాకి షాకింగ్ లేఖ రాశారు. గ్రామానికి రోడ్లు, కల్వర్టుల నిర్మాణం కోసం పదేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మించకపోగా, ఉన్న కాస్త దారిని గుంతలుగా తవ్వి వదిలేశారు. అంతేకాకుండా పదేళ్లుగా ఆ గుంతలు అలాగే ఉండిపోవడంతో, వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారుతోంది. కనీసం నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు లేఖలో హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, రోడ్లు వేయాలని మారుకి గ్రామ ప్రజలు స్థానిక పంచాయతీ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి చుట్టూ తిరుగుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు చివరకు హెలికాఫ్టర్ సమకూర్చాలని కోరుతూ హోంమంత్రికి లేఖ రాయాలని వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
నరకయాతన
గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం క్షీణించినా, గర్భిణుల ప్రసవ సమయం ఆసన్నమైనా ఆస్పత్రికి తీసుకెళ్లడం ఒక పెద్ద యుద్ధంలా మారిందని వాపోతున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అంబులెన్స్ రావడం లేదని తెలిపారు. రోగులను మంచాలపై లేదా కావిళ్లపై మోసుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రధాన రహదారి వరకు తీసుకువెళ్లాల్సి వస్తోందని, సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నా అధికారుల్లో చలనం ఉండటం లేదని లేఖలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, హెలికాఫ్టర్ కావాలంటూ గిరిజనులు రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డిజిటల్ ఇండియాలో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయంటూ ఆ లేఖను నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు.
