Begin typing your search above and press return to search.

పార్టీ మారిందని భార్యకు విడాకులు.. ఇప్పుడు ఆమే ఆయనకు ప్రత్యర్థి!

మరో 45 రోజుల్లో లోక్‌ సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను పురస్కరించుకుని చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి

By:  Tupaki Desk   |   11 March 2024 1:54 PM GMT
పార్టీ మారిందని భార్యకు విడాకులు.. ఇప్పుడు ఆమే ఆయనకు ప్రత్యర్థి!
X

మరో 45 రోజుల్లో లోక్‌ సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను పురస్కరించుకుని చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి. ఆసక్తికర ఘటనలు జరుగుతాయి. సొంత కుటుంబం నుంచే ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో నిలబడతారు. అలాగే అన్నదమ్ములు, భార్యాభర్తలు, తండ్రీ కుమారుడు ఇలా ఎవరైనా ఉండొచ్చు.

ఇప్పుడు ఇలాంటి విచిత్ర ఘటనే పశ్చిమ బెంగాల్‌ లో చోటు చేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మొత్తం 42 లోక్‌ సభ స్థానాలకు కొద్ది రోజుల క్రితం అభ్యర్థులను ప్రకటించారు.

ఈ నేపథ్యంలో టీఎంసీ ప్రకటించిన జాబితాలో అనేక చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. మమత పార్టీ తరఫున పోటీ చేయనున్నవారిలో క్రికెటర్లు.. కీర్తి ఆజాద్, యూసఫ్‌ పఠాన్, సినీ నటులు శత్రుఘ్న సిన్హా, రచన బెనర్జీ వంటివారు ఉన్నారు.

కాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్న సుజాత మోండల్‌ ఖాన్‌ తన మాజీ భర్తపై పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఆమె బిష్ణుపూర్‌ స్థానం నుంచి తన మాజీ భర్త, సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్‌ పై పోటీకి దిగుతున్నారు.

కాగా మొదట్లో సుజాత మోండల్‌ ఖాన్, సౌమిత్ర ఖాన్‌ బీజేపీలోనే ఉండేవారు. అయితే 2020లో సుజాత మోండల్‌ ఖాన్‌ బీజేపీని వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌ లో చేరారు. తన భార్య పార్టీ మారిన కారణానికి సౌమిత్ర ఖాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

2020లో తన భార్య సుజాత మోండల్‌ ఖాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ లో చేరాలని నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే సౌమిత్ర ఖాన్‌ ఆమెకు విడాకుల నోటీసు పంపారు. ఈ ఘటనతో అప్పట్లో వారిద్దరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కాగా 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సుజాత మోండల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఆరాంబాగ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు బిష్ణుపూర్‌ పార్లమెంటరీ స్థానానికి తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ... సుజాత మోండల్‌ ఖాన్‌ కు అవకాశమిచ్చారు. దీంతో ఆమె తన మాజీ భర్త, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సౌమిత్ర ఖాన్‌ పై పోటీ చేయనున్నారు. దీంతో మాజీ భార్యభర్తల మధ్య ఆసక్తికర పోటీకి తెరలేచింది.

ఇక బహరంపూర్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ బరిలోకి దిగనున్నారు. అలాగే కృష్ణానగర్‌ నుంచి ఇటీవల డబ్బులు తీసుకుని లోక్‌ సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొని తన పదవిని కోల్పోయిన మహువా మొయిత్రా పోటీ చేయనున్నారు.

ఇక పార్టీలో నెంబర్‌ టూ, మమత బెనర్జీ మేనల్లుడు, ఆమె వారసుడు అయిన అభిషేక్‌ బెనర్జీ డైమండ్‌ హార్బర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసన్‌ సోల్‌ నుంచి పోటీలో దిగనున్నారు. ఇక సందేశ్‌ ఖాలీ వివాదంలో వ్యాఖ్యల కారణంగా నటీమణి నుస్రత్‌ జహాన్‌ ను బసిర్హాట్‌ స్థానం నుంచి మమత తప్పించారు. ఆ స్థానంలో హాజీ నూరుల్‌ ఇస్లామ్‌ కు అవకాశమిచ్చారు.