Begin typing your search above and press return to search.

సుహాసిని ఈసారి రెండు చోట్ల పోటీ!

కాగా తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి సుహాసిని కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయొచ్చని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 9:29 AM GMT
సుహాసిని ఈసారి రెండు చోట్ల పోటీ!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెరలేచిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టోల రూపకల్పనపై దృష్టి సారించాయి.

ఈ క్రమంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అంశంపై సందిగ్ధత వీడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే 87 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు తమ అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. జనసేన పార్టీతో పొత్తు ఉంటుందా.. లేదా అనేది చంద్రబాబుతో మాట్లాడి ఫైనల్‌ చేస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె అయిన నందమూరి సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

సుహాసిని తొలిసారి 2018 ఎన్నికల్లో హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లి స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో సుహాసిని పరాజయం పాలయ్యారు. ఆమె సోదరులు జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ ఎన్నికల్లో ఆమె తరఫున ప్రచారం చేయలేదు. గెలిపించాలని సోషల్‌ మీడియా వేదికగా మాత్రమే పిలుపునిచ్చారు.

కాగా తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి సుహాసిని కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయొచ్చని అంటున్నారు. కూకట్‌ పల్లిలో ఆంధ్రా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని చెబుతున్నారు.

అలాగే కూకట్‌ పల్లితో పాటు సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ శివారు నియోజకవర్గం ఎల్బీ నగర్‌ నుంచి కూడా సుహాసిని బరిలో ఉంటారని తెలుస్తోంది. కూకట్‌ పల్లి, ఎల్బీ నగర్‌ రెండు స్థానాల్లోనూ ఆమెను పోటీ చేయించడానికి టీడీపీ అధిష్టానం నిర్ణయించిందని తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఇటీవల కూకట్‌ పల్లి, ఎల్బీ నగర్‌ నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. వీటిలో అధికార బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొనడం గమనార్హం.

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయనకు సానుభూతి వ్యక్తమవుతోందని.. దాన్ని ఉపయోగించుకుంటే సుహాసిని గెలుపొందచ్చని టీడీపీ లెక్కలేసుకుంటోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను గెలిపించుకుని అసెంబ్లీలో టీడీపీ తరఫున ఒక గళాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.