టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై... లేఖలో కీలక అంశాలు!
అవును... ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా.. మహానాడు జరిగిన పది రోజులకే ఆ పార్టీ సీనియర్ నేత బై బై చెప్పారు!
By: Tupaki Desk | 7 Jun 2025 3:03 PM ISTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం... వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు టీడీపీ, బీజేపీ, జనసేనలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే! వీరిలో అత్యంత కీలక నేతలు ఉన్నారు. అయితే.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు ముగిసిన కొన్ని రోజులకే ఆ పార్టీకి చెందిన ఉమ్మడి కడప జిల్లా కీలక నేత రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
అవును... ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా.. మహానాడు జరిగిన పది రోజులకే ఆ పార్టీ సీనియర్ నేత బై బై చెప్పారు! 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ పంపించారు.
ఇందులో భాగంగా... గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షులు అని అడ్రస్ చేస్తూ... "ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను.. నమస్తే" అంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖలో బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
మరోవైపు రాజంపేట తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని అంటున్నారు. తాజాగా రాజంపేటలోని ఓ కల్యాణ్ మండపంలో టీడీపీ నేత బత్యాల చెంగలరాయుడు వర్గీయులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవిని చెంగలరాయుడుకు ఇవ్వాలని, మోకాళ్లపై నిలబడి కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రాజంపేట టీడీపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారని.. నిజమైన కార్యకర్తలను పార్టీలో అన్యాయం జరుగుతుందని.. ఈ సందర్భంగా చెంగల రాయుడు అనుచరులు మండిపడ్డారు. సరిగ్గా ఈ నేపథ్యంలొనే బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా... మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. 1978లో రాయచోటి నుంచి జనతాపార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండ్రాయుడు.. 1983లో ఇండిపెండెంట్ గా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984లో రాజంపేట ఎంపీగా గెలుపొందారు.
అనంతరం... 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2024 ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత పార్టీగా ఉంటున్నారు.
