సూయజ్ టోల్‌కు ఓకే.. హార్ముజ్‌లో నో: ఎందుకీ తేడా?
అంతర్జాతీయ సముద్ర రవాణా రంగంలో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది.
By: A.N.Kumar | 10 April 2026 7:43 PM ISTఅంతర్జాతీయ సముద్ర రవాణా రంగంలో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు ఈజిప్టులోని సూయజ్ కాలువ, పనామా కాలువ వంటి మార్గాల్లో నౌకలు వేల డాలర్ల టోల్ చెల్లించి ప్రయాణిస్తుండగా ఇరాన్ సమీపంలోని హార్ముజ్ జలసంధి లో మాత్రం టోల్ వసూలు చేయకూడదని ప్రపంచ దేశాలు ఎందుకు పట్టుబడుతున్నాయి? అసలు ఈ రెండు రకాల జలమార్గాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? అన్నది చర్చనీయాంశమైంది.
వివాదానికి కేంద్ర బిందువు.. హార్ముజ్ జలసంధి
హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు సరఫరా మార్గం. పర్షియన్ గల్ఫ్‌ను ఒమాన్ గల్ఫ్ , అరేబియా సముద్రంతో కలిపే ఈ చిన్న జలసంధి ద్వారా ప్రపంచ చమురులో దాదాపు 20% రవాణా అవుతుంది. వ్యూహాత్మకంగా ఇది ఇరాన్ , ఒమన్ దేశాల మధ్య ఉంది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వం ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై 'రవాణా రుసుము' లేదా టోల్ వసూలు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో తమ సముద్ర తీర ప్రాంత భద్రతకు అయ్యే ఖర్చును నౌకల నుంచే వసూలు చేయాలని ఇరాన్ వాదిస్తోంది.
అంతర్జాతీయ చట్టం ఏమంటోంది?
హార్ముజ్ విషయంలో ఇరాన్ వాదనను ప్రపంచ దేశాలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలసంధుల ద్వారా ప్రయాణించే నౌకలకు 'ట్రాన్సిట్ ప్యాసేజ్' హక్కు ఉంటుంది. అంటే అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగపడే సహజ మార్గాల్లో ఏ దేశమూ ఆటంకాలు కలిగించకూడదు లేదా పన్నులు వసూలు చేయకూడదు. కేవలం నౌకలకు అందించే ప్రత్యక్ష సేవలు పైలటింగ్, లైట్ హౌస్ నిర్వహణ, టగ్ బోట్ల సాయం వంటి వాటికి మాత్రమే నామమాత్రపు ఫీజు వసూలు చేయాలి తప్ప కేవలం ఆ మార్గంలో వెళ్తున్నందుకు 'టోల్' వసూలు చేయడం చట్టవిరుద్ధం.
సూయజ్, పనామా కాలువలకు ఎందుకు మినహాయింపు?
సూయజ్ , పనామా కాలువల విషయంలో ప్రపంచ దేశాలు మారు మాట్లాడకుండా టోల్ చెల్లిస్తాయి. దీనికి గల కారణాలు ఇవే ఇవి సహజంగా ఏర్పడినవి కావు. వేల కోట్ల రూపాయల వ్యయంతో లక్షల మంది శ్రమతో భూమిని తవ్వి నిర్మించిన కృత్రిమ కాలువలు. ఈ కాలువలను నిరంతరం పూడిక తీయడం , లాక్ సిస్టమ్స్ నిర్వహించడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి ఆయా దేశాలు ఈజిప్ట్, పనామా భారీగా ఖర్చు చేస్తాయి. ఉదాహరణకు సూయజ్ కాలువ లేకపోతే నౌకలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని రావాలి. ఇది వేల కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి భారీ ఇంధన ఖర్చుకు దారితీస్తుంది. ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్నందుకు గాను రుసుము వసూలు చేసే హక్కు ఆ దేశాలకు ఉంటుంది.
ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం
ఒకవేళ ఇరాన్ పట్టుబట్టి హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరలేపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేపు మలక్కా జలసంధి లేదా ఇతర కీలక సహజ మార్గాల్లో ఉన్న దేశాలు కూడా టోల్ డిమాండ్ చేస్తే అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.
ప్రకృతి ప్రసాదించిన మార్గాలు అందరి సొత్తు అని అంతర్జాతీయ చట్టాలు చెబుతుంటే మనిషి నిర్మించిన మార్గాలు ఆయా దేశాల సార్వభౌమాధికారం కిందకు వస్తాయి. ఈ ప్రాథమిక వ్యత్యాసమే హార్ముజ్ వివాదానికి.. సూయజ్ ఆమోదానికి మధ్య ఉన్న అసలు రహస్యం. ఇరాన్ తీసుకోబోయే తదుపరి అడుగు అంతర్జాతీయ సముద్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది.
