Begin typing your search above and press return to search.

కామన్ ఎట్ అన్ కామన్... సుధామూర్తి కొత్త పుస్తకం రెడీ!

"కామన్ ఎట్ అన్ కామన్" పుస్తకంపై స్పందించిన సుధామూర్తి... తన స్వస్థలంలో ప్రేరణ పొందిన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   20 Aug 2023 1:30 AM GMT
కామన్  ఎట్  అన్  కామన్... సుధామూర్తి కొత్త పుస్తకం రెడీ!
X

ఉద్యోగిగా కంటే సంఘ సేవకురాలిగా, రచయిత్రిగా ఆమెను పెద్ద సంఖ్యలో అభిమానులున్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ముఖ్యంగా ఆమె రాసే చిన్న పిల్లల పుస్తకాలంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ సమయంలో ఆమె మరో పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.

అవును... 2017లో "త్రీ థౌజెండ్‌ స్టిచ్చస్‌" పేరుతో చిన్నపిల్లల పుస్తకాన్ని తీసుకొచ్చిన సుధామూర్తి.. సుమారు ఏడేళ్ల తర్వాత మరో పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా "కామన్ ఎట్ అన్ కామన్" (Common Yet Uncommon) అనే పుస్తాకాన్ని రెడీ చేస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ విషయం వెల్లడైంది.

సుధామూర్తి పుట్టిన రోజు సందర్భంగా పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్ ఈ విషయాన్ని తెలిపింది. కాగా... శనివారం (ఆగస్టు 19) సుధామూర్తి పుట్టిన రోజు! ఈ సందర్భంగా సుధామూర్తి రాబోయే పుస్తకంపై స్పందించారు. దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

"కామన్ ఎట్ అన్ కామన్" పుస్తకంపై స్పందించిన సుధామూర్తి... తన స్వస్థలంలో ప్రేరణ పొందిన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. భిన్నమైన సంప్రదాయాలు ఉన్న చిన్న గ్రామంలో తాను పుట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో... భిన్నమైన మనస్తత్వాలున్న మనుషులను చూస్తూ పెరిగినట్లు గుర్తుచేసుకున్నారు.

అనంతరం... ఈ పుస్తకంలో ఉన్న 14 రకాల ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయని హింట్ ఇచ్చిన సుధామూర్తి... ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఆ పాత్రలను బాగా ఎంజాయ్ చేస్తారని.. ఆ పాత్రలను గుర్తుకు తెచ్చుకొని వారిని ప్రశంసిస్తారని తెలిపారు.

అయితే సుధామూర్తి కొత్త పుస్తకాన్ని ఆక్టోబరులో తీసుకురానున్నామని పుస్తక ప్రచురణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో అన్ని ఇ-కామర్స్ వెబ్‌ సైట్లలో ప్రీ ఆర్డర్ బుకింగ్‌ లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

కాగా... 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరీ జిల్లా షిగ్గాన్ లో సుధామూర్తి జన్మించారు. తండ్రి ఎస్.ఆర్. కులకర్ణి వైద్యుడు. ఆమె బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య, నానమ్మల మధ్య గడిచింది.

ఇక టాటా వారి టెల్కోలో భారతదేశం మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా సుధామూర్తి ప్రవేశించినా.. ఇన్ఫోసిస్ నడిపే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు చైర్మన్ అయినా.. సుధా మూర్తి మాత్రం సింపిల్ సిటీకి మారుపేరులా ఉంటారనే పేరు సంపాదించుకున్నారు!