Begin typing your search above and press return to search.

సుధామూర్తి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సుధామూర్తిని తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 March 2024 5:08 AM GMT
సుధామూర్తి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
X

సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ రచయిత్రిగా, సంఘసేవకురాలిగా, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగా ఆమె సుపరిచితులు.

సుధామూర్తిని తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సుధామూర్తి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారారు. ఆమె ప్రత్యేకతల గురించి, ఆస్తుల గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపుతున్నారు.

సుధామూర్తి ఆస్తుల విషయానికొస్తే ఆమెకు ఇన్ఫోసిస్‌లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఇన్ఫోసిస్‌ షేరు ధర రూ.1,616.95 ఉంది. దీని ప్రకారం ఒక్క సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చని లెక్కలు వేస్తున్నారు.

ఇక సుధామూర్తి భర్త ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు అయిన ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌ లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయని సమాచారం. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుధామూర్తి ఆస్తుల విలువ హాట్‌ టాపిక్‌ గా మారింది.

కాగా 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌ పర్సన్‌ గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా ఖ్యాతిగడించారు. ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ లో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి సుధామూర్తి విశేష కృషి జరుపుతున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం చేత పద్మశ్రీ, 2023కిగానూ పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.

సుధామూర్తికి ఒక కుమార్తె అక్షత ఉన్నారు. అక్షత భర్త, సుధామూర్తి అల్లుడు అయిన రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రిగా ఉన్నారు. సుధామూర్తి ఇచ్చిన రూ.5 వేలతోనే తాను ఇన్ఫోసిస్‌ ను స్థాపించినట్టు ఆమె భర్త నారాయణమూర్తి పలుమార్లు చెప్పారు.

ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ కు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. సుధామూర్తి సొంత రాష్ట్రం కర్ణాటక.

రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి నామినేట్‌ అయిన సందర్భంగా పలు రంగాల్లో ఆమె చేసిన విశేష కృషిపై ప్రధాని మోదీ పొగడ్తలు కురిపించారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారమన్నారు. ఈ రంగాల్లో ఆమె అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రధాని కొనియాడారు.

సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనమని తెలిపారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ సుధామూర్తి అన్నారు. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి అని ప్రధాని మోదీ కోరుకున్నారు.

మరోవైపు రాజ్యసభకు నామినేట్‌ కావడం పట్ల సుధామూర్తి తన సంతోషాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆమె థాయ్‌ లాండ్‌ పర్యటనలో ఉన్నారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన విషయం తెలుసుకుని తనకు ఫోన్‌ చేసిన మీడియా ప్రతినిధితో మాట్లాడారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్‌ సర్‌ప్రైజింగ్‌ గా ఉందన్నారు. చాలా ఆనందంగా ఉందని.. ఇందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని తెలిపారు. తాను ఏనాడూ పదవులు కోరుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం తనను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదన్నారు. అయితే, దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యత అని విశ్వసిస్తున్నానని తెలిపారు.