Begin typing your search above and press return to search.

చెవిరెడ్డి మీద పోటీకి లేడీ ఫైర్ బ్రాండ్ రెడీ

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ నియోజకవర్గం స్పెషాలిటీ వేరు. దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదే చంద్రగిరి.

By:  Satya P   |   6 Sept 2025 8:00 AM IST
చెవిరెడ్డి మీద పోటీకి లేడీ ఫైర్ బ్రాండ్ రెడీ
X

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ నియోజకవర్గం స్పెషాలిటీ వేరు. దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదే చంద్రగిరి. చంద్రబాబు కాంగ్రెస్ లో చేరి తొలిసారి గెలిచిన నియోజకవర్గం అది. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె ఉన్నది అక్కడే. ఇక అదే చంద్రబాబు టీడీపీ వేవ్ లో 1983లో ఓడిన సీటూ చంద్రగిరే. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు 1994లో గెలిచిన సీటు సైతం చంద్రగిరి. అయితే తెలుగుదేశం అతి తక్కువ సార్లు గెలిచిన సీటు సైతం చంద్రగిరి గా చెబుతారు. అక్కడ కాంగ్రెస్ కి బలం ఎక్కువ. వైసీపీ పుట్టాక రెండు సార్లు ఆ పార్టీ గెలిచింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ కంచుకోటలకు సైతం కాలం చెల్లింది. అలా చంద్రగిరి సీటు వైసీపీ చేజారింది.

జెండా పాతిన నాని :

చెవిరెడ్డి ప్రాభవాన్ని తట్టుకుని పులివర్తి నాని చంద్రగిరిలో టీడీపీ జెండాను పాతేశారు. ఇక చెవిరెడ్డి 2024 లో పోటీ చేయకుండా తన కుమారుడు మోహిత్ రెడ్డిని బరిలోకి దింపాడు. అన్నీ తానై చూసుకున్నా కూడా చంద్రగిరి ఓటర్లు సైకిలెక్కేసారు. దాంతో ఏకంగా 45 వేల ఓట్ల భారీ మెజారిటీతో పులివర్తి నాని విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో పులివర్తి నాని భార్య అయిన సుధా రెడ్డి కీలక పాత్ర పోషించారు తన భర్త విజయం వెనక ఆమె ఉన్నారు. ఆ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా జరిగిన దాడులు ఘర్షణలలో ఆమె కాలికి కూడా గాయం అయింది. పైగా చెవిరెడ్డి వర్గం ఆమెను కూడా ఫోకస్ చేసి చేసిన విమర్శలు సుధా రెడ్డి మరచిపోలేకపోతున్నారుట.

ఈసారి నేనే అంటున్న ఎమ్మెల్యే సతీమణి :

వచ్చే ఎన్నికల్లో తానే చంద్రగిరి నుంచి పోటీ చేస్తాను అని సుధా రెడ్డి అంటున్నారు. ఆ విధంగా ఆమె తన రాజకీయ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. తానే రంగంలో ఉండి చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఓడిస్తాను అని ఆమె అంటున్నారు. చెవిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఆమె మరింత పట్టుదలగా రానున్న నాలుగేళ్ళ పాటు పనిచేస్తాను అంటున్నారు. తనకు తప్పకుండా చంద్రబాబు టికెట్ ఇస్తారు అని అంటున్నారు. ఆమె ధీమాకు చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు.

మహిళా రిజర్వేషన్ ద్వారా :

వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని ఆ విధంగా తనకు చంద్రగిరి సీటు దక్కుతుందని సుధా రెడ్డి భావిస్తున్నారు. అంతే కాదు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందని భావిస్తున్నారు. దాంతో ఎలాగైనా తనకు చంద్రగిరి టికెట్ ఖాయమని లెక్కలేస్తున్నారు. ఇదే క్రమంలో ఆమె దూకుడు పెంచేశారు అని అంటున్నారు. ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ తో పాటు నాయకులను కలుస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. అలా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి చెవిరెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా షాక్ ఇవ్వాలని లేడీ ఫైర్ బ్రాండ్ భారీ పధక రచన చేస్తున్నారు. దాంతో చంద్రగిరి పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయని అంటున్నారు.