Begin typing your search above and press return to search.

భారమవుతున్న విదేశీ విద్య.. తగ్గుతున్న అవకాశాలు.. పెరుగుతున్న ఖర్చులు

ఇది ఈ యువకుడి పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్య తర్వాత ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. దీనికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి.

By:  Tupaki Desk   |   5 Jun 2025 7:00 AM IST
భారమవుతున్న విదేశీ విద్య..  తగ్గుతున్న అవకాశాలు.. పెరుగుతున్న ఖర్చులు
X

భారతీయ విద్యార్థుల్లో విదేశాల్లో చదువుకోవాలనే కోరిక రోజురోజుకు పెరిగిపోతుంది. మంచి ఉద్యోగం, భారీ జీతం, అంతర్జాతీయ అనుభవం వంటి ఎన్నో కలలతో లక్షల రూపాయల అప్పులు చేసైనా సరే.. యూకే, కెనడా వంటి దేశాలకు పరుగులు పెడుతున్నారు. కానీ, ఈ కలలు నెరవేరడం అంత సులభం కాదని ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు తెలియజేస్తున్నాయి. విదేశీ విద్య ఆర్థిక భారం అవుతుందని తెలుస్తోంది.

ఇటీవల ఒక యువకుడు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేయాలని ఏకంగా రూ.40 లక్షల ఎడ్యూకేషనల్ లోన్ తీసుకున్నాడు. చదువు పూర్తవగానే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం వస్తుందని, తీసుకున్న అప్పును సులభంగా తీర్చవచ్చని అనుకున్నాడు. కానీ, అతని కలలు కల్లలయ్యాయి. అమెరికాలో ఉద్యోగం దొరక్కపోవడంతో అతను ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ ఉద్యోగం దొరకడానికి దాదాపు ఏడాది పట్టింది. చివరికి, నెలకు రూ.75 వేల జీతంతో ఒక ఉద్యోగం లభించింది. ఇక్కడే అసలు కష్టం మొదలైంది. అతను ప్రతి నెలా బ్యాంకుకు కట్టాల్సిన ఈఎంఐ (EMI) రూ.66 వేలు. అంటే, అతని జీతంలో దాదాపు 90 శాతం వరకు ఈఎంఐకే సరిపోతోంది. మిగిలిన రూ.9 వేలతో అతను తన వ్యక్తిగత ఖర్చులను, కుటుంబ అవసరాలను ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నాడు.

పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఉద్యోగావకాశాలు

ఇది ఈ యువకుడి పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్య తర్వాత ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. దీనికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి.

పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు: అమెరికాలో మాస్టర్స్ డిగ్రీకి ఏటా రూ.25 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు (పబ్లిక్/ప్రైవేట్ యూనివర్సిటీని బట్టి) ఖర్చవుతుంది. దీనికి అదనంగా వసతి, ఆహారం, రవాణా, ఆరోగ్య బీమా వంటి జీవన వ్యయాలు ఏటా రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉంటాయి. మొత్తం మీద ఒక మాస్టర్స్ డిగ్రీకి రూ.50 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.

రుణ భారం: ఈ ఖర్చులన్నింటినీ కవర్ చేయడానికి చాలా మంది విద్యార్థులు భారీగా విద్యా రుణాలు తీసుకుంటున్నారు.

ఉద్యోగావకాశాల్లో అనిశ్చితి: కొన్ని దేశాల్లో పోస్ట్-స్టడీ వర్క్ వీసా నిబంధనలు కఠినతరం అవుతుండడంతో విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సంపాదించడంలో ఇబ్బందులు పడుతున్నారు.

రూపాయి బలహీనత: రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతుండటం వల్ల, విద్యార్థులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.

భారత్‌లో జీతాల అంచనాలు: విదేశాల్లో చదువుకున్న వారికి ఇండియాలో లక్షల్లో జీతాలు వస్తాయన్న అంచనాలు కొన్నిసార్లు నిజం కావడం లేదు. మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి ఇండియాలో సగటున రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వార్షిక వేతనం లభించే అవకాశం ఉంది.. కానీ ఇది కోర్స్, యూనివర్సిటీ, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ పరిస్థితుల దృష్ట్యా, విదేశీ విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొన్ని కీలక విషయాలను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగానే ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి ఎంత అవుతాయో స్పష్టంగా అంచనా వేసుకోవాలి. తీసుకునే రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యంపై అంచనాలు వేసుకోవాలి. EMI మొత్తం, లోన్ టెన్యూర్ లెక్కించుకోవాలి. రూ.40 లక్షల లోన్ తీసుకుంటే 10-15 సంవత్సరాల టెన్యూర్ తో 9-11శాతం వడ్డీ రేటుతో ఈఎంఐలు రూ.45,000 నుంచి రూ.55,000 వరకు ఉండవచ్చు. పైన చెప్పిన సందర్భంలో ఈఎంఐ రూ.66 వేలు అంటే తను లోన్ టెన్యూర్ తక్కువ అయి ఉండవచ్చు. వడ్డీ రేటు అయినా ఎక్కువ ఉండవచ్చు. చదువు పూర్తయిన తర్వాత ఆయా దేశాల్లో, లేదా తిరిగి భారత్‌కు వస్తే ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి, ఎంత జీతం ఆశించవచ్చు అనే దానిపై పక్కా పరిశోధన చేయాలి. సాధ్యమైనంత వరకు స్కాలర్‌షిప్‌లు, ఫైనాన్షియల్ ఎయిడ్ పొందే ప్రయత్నం చేయాలి. విదేశీ విద్య ఆర్థికంగా భారంగా అనిపిస్తే, భారతదేశంలోనే మంచి విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించే ప్రత్యామ్నాయాలను కూడా పరిగణించుకోవాలి.