నరకాన్ని తట్టుకోలేకపోతున్నా.. ఉరేసుకొని పదహారేళ్ల విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న లెటర్!
ఈ మధ్యకాలంలో విద్యార్థులపై విద్యా ఒత్తిడి భారీగా పెరిగిపోతోందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 4 Aug 2025 12:45 PM ISTఈ మధ్యకాలంలో విద్యార్థులపై విద్యా ఒత్తిడి భారీగా పెరిగిపోతోందని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఒక్క విద్యా ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా చదువు తమ బుర్రలకు ఎక్కడం లేదు అని, అటు తల్లిదండ్రులు ఇటు అధ్యాపకులు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని చాలామంది విద్యార్థి విద్యార్థినులు సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోతున్నారు. కొంతమంది స్కూల్ , కాలేజ్ బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటే.. మరి కొంతమంది ఉరి వేసుకొని చనిపోతున్నారు. ఇంకొంతమంది చనిపోవడానికి వివిధ మార్గాలు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు పదహారేళ్ల విద్యార్థిని కూడా ఈ విద్యా ఒత్తిడికి బలి అయింది. ఈ చదువులు చదవలేను.. నావల్ల కాదు అంటూ ఒక లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లాలోని నయీంనగర్ లోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శివాని హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాను తీసుకున్న గ్రూప్ వల్ల తనకు చదువు అర్థం కావడం లేదు అని, తనను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని భావోద్వేగంతో నిండిన నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
శివాని రాసిన లెటర్ లో ఏముంది అనే విషయానికి వస్తే.. మమ్మీ.. నా చెల్లిని బాగా చదివించండి మంచి కాలేజీలో చేర్పించండి. మంచి గ్రూప్ తీసుకోమని చెప్పండి. నాలాగా అర్థం కాని చదువు తనకు వద్దు. తనను బాగా చదివించి, మీరు కూడా మంచిగా ఉండండి. కాలేజీలో జాయిన్ చేసేముందు ఎవరినైనా కొంచెం అడిగి మరీ జాయిన్ చేయండి.. చెల్లి నువ్వు కూడా మంచిగా చదువుకోవే. నాకేమో ఈ చదువు అర్థం కావడం లేదు. మీకు చెప్తే మీరు అర్థం చేసుకోవడం లేదు. నాకు టెన్షన్ అయిపోయింది. మైండ్ పోతోంది. మీరు చెప్పిన చదువు నాతో కావడం లేదు. నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకోవడం లేదు. చివరికి నాకు చావే దిక్కయింది. ఈ చదువు అర్థం కాక మీరు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక మధ్యలో నలిగిపోతున్నాను. ఈ సంవత్సరం అంటే ఏదో మీరు ఫీజు కట్టారు అని.. ఏదోలా కింద మీద పడి చదువుతున్నాను. ఇక నాతో కాదు.. నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఇంత తక్కువ మార్కులు రావడం నేను, మీరు తట్టుకోలేరు. అందుకే చనిపోతున్నాను. అందరూ జాగ్రత్త. ఈ ఒక్క సంవత్సరం కూడా నేను మీకోసమే చదివినా.. అయినా నాతో కావడం లేదు. ఎంత కష్టపడ్డా ఈ చదువు నా బుర్రకు ఎక్కడం లేదు . అందరూ జాగ్రత్త అంటూ విద్యార్థిని తన సూసైడ్ నోట్ లో రాసింది.
ప్రస్తుతం ఇది చూసి పలువురు విద్యార్థులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇకనైనా తల్లిదండ్రులు, అధ్యాపకులు పిల్లలపై విద్యా ఒత్తిడి తీసుకురాకండి అని, వారు నచ్చిన విధంగా చదువుకునేలా వారిని ప్రోత్సహించండి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
