Begin typing your search above and press return to search.

లవ్ బ్రేకప్ వేళ మందేసిన కృష్ణా జిల్లా అమ్మాయి.. ఖాకీలకు చుక్కలు!

ప్రేమ విఫలమైతే? విషాదంలో కూరుకుపోతారు. మందు కొడతారు. లేదంటే సైలెంట్ గా ఏడుస్తూ ఉండిపోతారు. లోకంతో సంబంధం లేనట్లుగా ఉండిపోతారు

By:  Tupaki Desk   |   13 Jun 2025 9:35 AM IST
లవ్ బ్రేకప్ వేళ మందేసిన కృష్ణా జిల్లా అమ్మాయి.. ఖాకీలకు చుక్కలు!
X

ప్రేమ విఫలమైతే? విషాదంలో కూరుకుపోతారు. మందు కొడతారు. లేదంటే సైలెంట్ గా ఏడుస్తూ ఉండిపోతారు. లోకంతో సంబంధం లేనట్లుగా ఉండిపోతారు. ఇలాంటివి చాలానే చెబుతారు. అయితే.. కృష్ణా జిల్లా అమ్మాయి ఒకరు తన ప్రేమ ఫెయిల్ అయిన వేళ చేసిన పనికి పోలీసులు సైతం ముచ్చమటలు పట్టిన పరిస్థితి. లవ్ ఫెయిల్ అయిన వేళ పూటుగా మందేయటం.. ఒళ్లు తెలియని పరిస్థితుల్లోకి జారి పోవటమే కాదు.. ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్న పోలీసులకు చుక్కలు చూపించింది. స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలో మరిన్ని నాటకీయ పరిణామాలు ఉన్నాయి. అసలేం జరిగిందంటే..

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన ఒక అమ్మయి ఊరి నుంచి గుడ్లవల్లేరుకు వచ్చి ఒక కాలేజీలో చదువుతోంది. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నం - చిలకలపూడి బీచ్ లో నిర్వహించిన ఫెస్టివల్ కు వెళ్లింది. అక్కడ ఆమెకు గుడివాడ మండలానికి చెందిన ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. గురువారం సాయంత్రం కాలేజీ పూర్తైన తర్వాత సదరు కుర్రాడికి ఫోన్ చేసిన ఆమె.. తన లవ్ ఫెయిల్ అయ్యిందని.. ఈ బాధ వేళ మందు తాగాలని ఉందని చెప్పింది. లిక్కర్ బాటిల్ తీసుకురమ్మని కోరింది. దీంతో అతడు మందు బాటిల్ తీసుకెసల్లగా ఇద్దరు కలిసి అతడి బండిపై గుడ్లవల్లేరు - గుడివాడ మార్గంలోని డొంకదారిలో ఒక పొలం గట్టున కూర్చొని మందు తాగారు.

ఫుల్ గా మందు కొట్టేసిన ఆ అమ్మాయి మద్యం మత్తులో కూరుకుపోయింది. చివరకు లేచి నిలబడలేని పరిస్థితి. దీంతో.. బెదిరిన ఆ కుర్రాడు తన స్నేహితులకు ఫోన్ చేసి సాయం కోరాడు. దీంతో అక్కడకు మరో ఇద్దరు వచ్చారు. చివరకు ఆమె బండిపై కూర్చునే స్థితిలో లేకపోవటంతో బెదిరిపోయిన ఒకరు.. తన వల్ల కాదంటూ పారిపోయాడు. దీంతో మిగిలిన ఇద్దరు ఆమెను బండి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు.

ఇదే సమయంలో గుడ్లవల్లేరుకు చెందిన ఒక యువకుడు అటు వైపుగా వెళుతూ.. వీరు ఆ అమ్మాయిని ఏదో చేయబోతున్నారని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి.. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఆమె పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మీద వీరంగాన్ని ప్రదర్శించటమే కాదు.. ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. దీంతో పోలీసులు సైతం హడలిపోయిన పరిస్థితి. ఆమెను కంట్రోల్ చేసి.. అతి కష్టమ్మీదా ఆమె వివరాల్ని తెలుసుకొని వారి పేరెంట్స్ ను పిలిపించి.. అప్పజెప్పారు. లవ్ ఫెయిల్ అయిన వేళ.. సదరు అమ్మాయి చేసిన వీరంగం స్థానికంగా సంచలనంగా మారింది.