Begin typing your search above and press return to search.

నా ఫోన్ తీసుకుంటావా? లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. వీడియో

సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   22 April 2025 11:11 AM
నా ఫోన్ తీసుకుంటావా? లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. వీడియో
X

విశాఖపట్నం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాల ప్రాంగణంలో మొబైల్ ఫోన్ వాడొద్దన్న నిబంధన పాటించకుండా ఫోన్ మాట్లాడుతున్న ఓ విద్యార్థిని నుంచి మహిళా లెక్చరర్ ఫోన్ లాక్కోవడంతో ఆగ్రహించిన విద్యార్థిని, లెక్చరర్‌పై దాడికి పాల్పడింది. ఈ ఘటన భీమునిపట్నం మండలం దాకమర్రి సమీపంలోని రఘు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగినట్లు సమాచారం.

సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళాశాల ఆవరణలో విద్యార్థిని ఫోన్ మాట్లాడుతూ ఉండగా, అక్కడే ఉన్న మహిళా లెక్చరర్ ఆమెను అడ్డుకుని ఫోన్ తీసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థిని, లెక్చరర్‌ను దుర్భాషలాడుతూ "రూ.12 వేల విలువైన నా సెల్ ఫోన్ తీసుకుంటావా" అంటూ వాగ్వాదానికి దిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో, విద్యార్థిని తన కాలికి ఉన్న చెప్పుతో లెక్చరర్‌పై దాడి చేసింది.

ఈ ఊహించని పరిణామంతో అవాక్కయిన లెక్చరర్ సైతం ఆత్మరక్షణ కోసం విద్యార్థినిపై ప్రతిదాడికి యత్నించారు. వెంటనే అక్కడే ఉన్న తోటి విద్యార్థులు, కొందరు సిబ్బంది కల్పించుకుని ఇద్దరినీ విడదీశారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న మరో విద్యార్థి సెల్ ఫోన్‌లో వీడియో తీయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు సెల్ ఫోన్లు వాడకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, కొంతమంది విద్యార్థులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఇలా ఫోన్లు స్వాధీనం చేసుకున్నప్పుడు కొందరు విద్యార్థులు ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది.

గురుశిష్యుల సంబంధానికి మాయని మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటనపై రఘు కాలేజీ యాజమాన్యం స్పందించి, అంతర్గత విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.