Begin typing your search above and press return to search.

నాన్ స్టాపులుగా మారుతున్న పల్లె వెలుగు బస్సులు.. ఇవన్నీ ‘స్త్రీశక్తి’ కష్టాలు

ఏపీలో ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలు అవుతోంది. ఆగస్టు 15న నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ పథకాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుటున్నారు.

By:  Tupaki Political Desk   |   20 Oct 2025 3:00 AM IST
నాన్ స్టాపులుగా మారుతున్న పల్లె వెలుగు బస్సులు.. ఇవన్నీ ‘స్త్రీశక్తి’ కష్టాలు
X

ఏపీలో ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలు అవుతోంది. ఆగస్టు 15న నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ పథకాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుటున్నారు. రోజుకు సుమారు 28 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నట్లు ఓ అంచనా. అయితే ‘స్త్రీశక్తి’ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా కొందరు ఆర్టీసీ సిబ్బంది తీరు వల్ల పథకం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరు కన్నా చెడ్డ పేరు ఎక్కువగా మూటగట్టుకోవాల్సివస్తోందని అంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు పథకంపై సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో 11 రకాల బస్సు సర్వీసులు ఉంటే కేవలం ఐదు బస్సు సర్వీసులకు మాత్రమే ఉచితం వర్తిస్తుందని షరతులు విధించారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వం చెప్పినట్లు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సు సర్వీసులల్లో ‘స్త్రీశక్తి’ కింద ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలతో పోల్చితే ఏపీలో ‘స్త్రీశక్తి’పై పెద్దగా వ్యతిరేక కథనాలు రాలేదు. ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు, అత్యంత దగ్గరగా పర్యవేక్షణ ఉండటం వల్ల ప్రారంభంలో పాజిటివ్ టాక్ వినిపించింది.

అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గిపోవడంతో ‘స్త్రీశక్తి’పై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉచిత ప్రయాణ సౌకర్యార్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకోవడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగిపోయింది. ఆ ప్రకారం సర్వీసులు పెరగకపోవడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు. దీంతో ఉచిత బస్సుల స్టాపులను సిబ్బంది సొంతంగా తగ్గించేస్తున్నారని అంటున్నారు. నిర్దేశిత స్టాపుల్లో కూడా బస్సులను ఆపకుండా ముందుకు తీసుకుపోతున్నారు. దీంతో ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

ప్రధానంగా ఎక్కువ సర్వీసులు ఉన్న పల్లెవెలుగు బస్సులు నాన్ స్టాప్ సర్వీసులుగా మారిపోయాయని ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సు రద్దీగా ఉంటుండటంతో ప్రయాణికులు దిగేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా డ్రైవర్లు తమ ఇష్టం వచ్చిన దగ్గర బస్సులు నిలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో గతంలో ఆర్టీసీ బస్సులు అంటే సమయపాలనకు మారుపేరుగా చెప్పేవారు. కానీ, ఇప్పుడు తీవ్రమైన రద్దీ వల్ల గంటలో ముగియాల్సిన ప్రయాణం రెండు గంటలు అవుతోందని అంటున్నారు. ‘స్త్రీశక్తి’ వల్ల రద్దీ పెరుగుతుందని ప్రభుత్వం ఊహించినా, ఆ మేరకు సర్వీసులు పెంచకపోవడం, అదనపు సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.

పథకం ప్రారంభించిన తొలి పది, పదిహేను రోజుల్లో పాజిటివ్ టాక్ రావడంతో ప్రభుత్వం అక్కడితో వదిలేసిందని, ఆ తర్వాత ‘స్త్రీశక్తి’పై పర్యవేక్షణ లేకపోవడంతో రెండు నెలలకే వ్యతిరేకత ఎదుర్కొవాల్సివస్తోందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ‘స్త్రీశక్తి’ వల్ల ప్రభుత్వంపై ఇతర వర్గాలలో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.