పంచాయితీ ఎన్నికల వేళ తెలంగాణలో పొత్తు సిత్రాలు చూస్తే అవాక్కే
ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా.. లేదా? అన్నదే ముఖ్యమన్న సినిమా డైలాగ్ కు దగ్గరగా తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సిత్రాలు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Dec 2025 10:38 AM ISTఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా.. లేదా? అన్నదే ముఖ్యమన్న సినిమా డైలాగ్ కు దగ్గరగా తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సిత్రాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు.. తమకు ఏ మాత్రం పొసగని పార్టీలతో వారు పొత్తు కుదుర్చుకుంటున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ గెలుపు మాత్రమే ముఖ్యం తప్పించి.. మరింకేమీ కాదంటున్నారు. పార్టీ గుర్తులపై పంచాయితీ ఎన్నికలు జరగని నేపథ్యంలో.. పార్టీలు బలపర్చిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో.. గెలుపు కోసం చేసుకుంటున్న రాజీలు.. అనుసరిస్తున్న విధానాల్ని చూస్తే విస్మయానికి గురి కావాల్సిందే.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 35 పంచాయితీల్లో బీఆర్ఎస్.. బీజేపీ కలిసి పోటీ చేస్తే అన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించటం గమనార్హం. బీఆర్ఎస్ 32, బీజేపీ 3 పంచాయితీల్లో విజయం సాధించాయి. అదే సమయంలో ఇదే జిల్లాలో అధికార కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీతో కలిసి తొమ్మిది పంచాయితీల్లో పోటీ చేయగా.. ఎనిమిది పంచాయితీల్లో కాంగ్రెస్, ఒక పంచాయితీని బీఆర్ఎస్ సొంతం చేసుకున్నాయి. ఒక పంచాయితీలో అయితే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవటానికి కాంగ్రెస్.. బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారంతా కలిసి ఉమ్మడిగా ప్రయత్నించి అనుకున్నది సాధించారు.
హన్మకొండ జిల్లా పరిధిలోని అయినవోలు మండలంలో బీఆర్ఎస్.. బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఫలితంగా ఈ మండలంలో బీఆర్ఎస్ ఐదు.. బీజేపీ ఒక సర్పంచ్ సీట్లను సొంతం చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఫలితాలను చూసుకున్న బీఆర్ఎస్.. బీజేపీలు రెండో దశలో పరస్పరం సహకరించుకోవటం కనిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి బలంగా ఉన్నచోట బీజేపీ.. కమలం పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నచోట బీఆర్ఎస్ మద్దతు ఇవ్వటం ద్వారా గెలుపును సులువు చేసుకున్న వైనం కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని కొన్ని పంచాయితీల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ - బీజేపీలు మద్దతుతో తమ ప్రత్యర్థులను ఓడించగా.. ఇదే జిల్లాల్లో ఇంకొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య పొత్తు నడిచి విజయం సాధించేలా ఒప్పందం చేసుకున్నాయి.
ఇదంతా చూస్తే.. పంచాయితీ ఎన్నికల్లో స్థానిక అవసరాలు.. అభ్యర్థుల సత్తాకు తగ్గట్లే ఎన్నికలు జరుగుతున్నాయి తప్పించి.. పార్టీలు.. పార్టీల మధ్య సహజంగా ఉండే శత్రుత్వం లాంటివి ఏమీ లేని వైనం కనిపిస్తుంది. ఒకపంచాయితీలో జనసేన అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వటం గెలవటం గమనార్హం. ఇలా సైద్ధాంతిక వైరుధ్యాల్ని పక్కన పెట్టేసి.. పంచాయితీల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో.. ఇలా సిత్రవిచిత్రమైన కాంబినేషన్ లో పొత్తులు పెట్టుకొని తాము డిసైడ్ అయిన వారిని గెలిపించుకోవటానికి ఊహకు అందని ఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేశారని చెప్పాలి.
