Begin typing your search above and press return to search.

ఫ్యూచర్స్ కట్టడికి సెబీ ప్లానింగ్.. కమిటీ కీలక సిఫార్సులు

షేర్ మార్కెట్.. స్టాక్ మార్కెట్.. వాడే మాట ఏదైనా.. చేసేది మాత్రం ఒక్కటే అన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   10 July 2024 5:49 AM GMT
ఫ్యూచర్స్ కట్టడికి సెబీ ప్లానింగ్.. కమిటీ కీలక సిఫార్సులు
X

షేర్ మార్కెట్.. స్టాక్ మార్కెట్.. వాడే మాట ఏదైనా.. చేసేది మాత్రం ఒక్కటే అన్న విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్ లో మదుపు చేయటం ద్వారా భారీగా సంపాదించొచ్చన్న ఆలోచనే తప్పించి.. అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అందుకు పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఏంటి? నష్టపోకుండా ఉండటానికి ఎలా వ్యవహరించాలి? భావోద్వేగాల్ని నియంత్రించుకుంటూ పెట్టుబడులు పెట్టాలి? లాంటి వాటి మీద ఎలాంటి అవగాహన లేకుండా ట్రేడ్ చేసే వారే అత్యధికులు.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్న రీతిలో.. ఎవరో ఏదో కొన్నారని.. వారు షేర్లలో బాగా సంపాదించారంటూ ఒక వ్యూహం లేకుండా మదుపు చేసి లక్షలాది రూపాయిలు పోగొట్టుకునే వారెందరో. క్రమపద్దతిలో సంపాదన కంటే.. తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాల్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉండే అత్యంత రిస్కుతో కూడిన ఫ్యూచర్స్ .. ఆప్షన్స్ లో పెట్టుబడులు పెట్టటం భారీగా నష్టపోతున్న వారున్నారు.

ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో పెట్టుబడులు పెట్టాలంటే కనీసం ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు ట్రేడింగ్ మీద ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారు పెట్టాలని నిపుణులు సూచనలు చేస్తారు. అలాంటి మాటలు ఎవరైనా చెబితే నవ్వి పోవటం ఖాయం. ఈ కారణంగానే మన దేశంలో ఈ విబాగాల్లో ట్రేడ్ చేసే వారిలో నూటికి 95 శాతం మంది నష్టాల్ని చవి చూస్తుంటారన్నది ఒక అంచనా. మొదట్లో డబ్బులు వచ్చినట్లుగా అనిపించినా.. ఏడాది సరాసరి చూస్తే.. లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొందరు అప్పులు చేసి మరీ ఇందులోకి దిగి.. ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన దుస్థితి.

ఇటీవల కాలంలో చిన్న మదుపర్లు ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో దూకుడుగా పెట్టుబడులు పెట్టటం.. భారీగా నష్టపోవటం.. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వేళ.. అలాంటి వారిని నియంత్రించేందుకు సెబీ ఇప్పుడు ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి వారి సలహాలు.. సూచనలు తీసుకుంటోంది. గత నెలలో సెబీ నియమించిన నిపుణుల కమిటీ పలు సిఫార్సులు చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కొన్ని చర్యల్ని తక్షణమే చేపట్టాలని సదరు కమిటీ సెబికి సూచన చేసినట్లుగా చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

- ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి ఉన్న డెరివేటివ్ కాంట్రాక్టుకు కనీస లాట్ పరిణామాన్ని రూ.20-30 లక్షలకు పెంచాలి. దీంతో చిన్న మదుపరులు ఇందులో పెట్టుబడులు పెట్టే వీలుండదు. తక్కువ పెట్టుబడితో ట్రేడ్ చేసే వారిని దూరంగా ఉంచటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

అయితే.. మార్జిన్ కింద తక్కువ మొత్తంతోనే ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ట్రేడ్ చేసేందుకు బ్రోకరేజీలు వీలు కల్పిస్తుంటాయి. నిపుణుల సూచన ప్రకారం లాట్ పరిణామాన్ని పెంచితే ఆ మేరకు మార్జిన్ మొత్తాన్ని కూడా బ్రోకరేజీలు పెంచే వీలుందని చెబుతున్నారు.

- వారంలో గడుపు తీరే కాంట్రాక్టుల సంఖ్యను కుదించాలి. ఒక ఎక్ఛ్సేంజీకి వారంలో ఒకటే వారం కాంట్రాక్టు ఎక్స్ పైరీకి అనుమతివ్వాలి. ఇప్పుడున్న పద్దతి ప్రకారం నిఫ్టీ 50 సూచీ వారం కాంట్రాక్టు గురువారం ముగుస్తోంది. బ్యాంక్ నిఫ్టీ బుధవారం.. ఫైనాన్షియల్ నిఫ్టీ మంగళవారం.. మిడ్ క్యాప్ నిఫ్టీకి సోమవారం ఎక్స్ పైరీగా ఉంటోంది.

బీఎస్ఈలో సెన్సెక్స్ వారం కాంట్రాక్టుల గడువు శుక్రవారం. కాంట్రాక్టులు తీసుకున్న వారు.. ఆ రోజుకు తమ లాభనష్టాలను భరించాల్సి ఉంటుంది. తాజాగా నిపుణులు చేసిన సూచనను అమల్లోకి తీసుకొస్తే ఎన్ఎస్ ఈ.. బీఎస్ ఈలు పరిమితసంఖ్యలోనే వారం కాంట్రాక్టులను ట్రేడింగ్ కు అందుబాటులో ఉంచే వీలుంది. ఇప్పుడున్న విధానంలో వివిధ రకాల సూచీల్లో వారం కాంట్రాక్టులు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నారు.

వారంలో గడువు తీరే చాలా కాంట్రాక్టుల వల్ల ఆర్థిక ప్రయోజనం ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డెరివేటివ్ ఉత్పత్తులను సాధారణంగా హెడ్జింగ్ కోసం వాడాల్సి ఉండగా.. కేవలం స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కోసం అత్యధికులు వినియోగిస్తున్నారు.

- ఆప్షన్ కాంట్రాక్టులకు స్ట్రైక్ ధరల సంఖ్యను పరిమితం చేయాలి. అసాధారణ స్థాయిలో పెరిగిపోతున్న డెరివేటివ్ కాంట్రాక్టుల లావాదేవీల పరిమాణాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం పనికి వస్తుందని చెబుతున్నారు.

ఆప్షన్ల కాంట్రాక్టుల కోసం ట్రేడర్ల నుంచి ముందస్తు మార్జిన్ వసూలు చేయటం.. ఇంట్రాడేలో పొజిషన్ల పరిమితిపై పర్యవేక్షణ.. ఎక్స్ పైరీ గడువు సమీపించినప్పుడు మార్జిన్ పరిమితి పెంచటంలాంటి సిఫార్సులను కూడా నిపుణుల కమిటీ చేసినట్లుగా చెబుతున్నారు. నిపుణుల కమిటీ సిఫార్సులను సెకండరీ మార్కెట్ అడ్వయిజరీ కమిటీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.

స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు.. మౌలిక పెట్టుబడుల ట్రస్టుల నిబంధనల్లో ప్రతిపాదించిన సవరణలపైనా ప్రజాభిప్రాయాల్ని సెబీ ఆహ్వానిస్తోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇన్విట్ లేదంటే రీట్ లో గణనీయమైన వాటా ఉన్న ఒక యూనిట్ హోల్డర్ కు ఒక డైరెక్టర్ ను నామినేట్ చేసే హక్కు ఉంది. వారి వాటా పరిమితి నిర్దేశిత పరిమితికి మించాల్సి ఉంటుంది.

సెబీ నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్ ను నామినేట్ చేసే అధికారం ఉన్నట్లైయితే.. డైరెక్టర్ ను నామినేట్ చేసే విషయంలో యూనిట్ హోల్డర్లపై ఆంక్షలు వర్తించవని తాజా ప్రతిపాదనల్లో సెబీ చెబుతోంది. వీటిపై ీ నెల 26లోపు అభిప్రాయాల్ని తెలపొచ్చని చెబుతోంది. సెబీ విడుదల చేసిన గణాంకాల్ని చూస్తే ట్రేడింగ్ లావాదేవీల టర్నోవర్ 2017-18లో రూ.210 లక్షల కోట్లు కాగా.. 2023-24లో రూ.500 లక్షల కోట్లకు చేరింది. ఆప్షన్ కాంట్రాక్టులను ట్రేడ్ చేసే వ్యక్తిగత ట్రేడర్లు 2017-18లో 2 శాతం ఉంటే.. 2023-24 నాటికి 41 శాతానికి పెరగటం గమనార్హం.