Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్ లో అదే రోజు సెటిల్ మెంట్

మారుతున్న కాలానికి తగ్గట్లు తనను తాను మార్చుకుంటోంది సెబీ. గతంలో స్టాక్ మార్కెట్ తో సంబంధాలు కొన్ని వర్గాలకే పరిమితమయ్యేవి.

By:  Tupaki Desk   |   28 Nov 2023 3:30 PM GMT
కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్ లో అదే రోజు సెటిల్ మెంట్
X

మారుతున్న కాలానికి తగ్గట్లు తనను తాను మార్చుకుంటోంది సెబీ. గతంలో స్టాక్ మార్కెట్ తో సంబంధాలు కొన్ని వర్గాలకే పరిమితమయ్యేవి. గడిచిన పాతికేళ్లలో చోటు చేసుకున్న మార్పు అందరికి తెలిసిందే. కొవిడ్ పుణ్యమా అని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టటం ఒక అలవాటుగా మారింది. దీనికి తోడు అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఈ తరం యువకులు సైతం స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ.. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటివేళ.. పాత విధానాలకు స్వస్తి పలికి.. సెటిల్ మెంట్లను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల సెటిల్ మెంట్ గడువును టీప్లస్ 2 నుంచి టీ ప్లస్ 1కు తగ్గించటం తెలిసిందే. తాజాగా వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చే మార్పుల గురించి తాజాగా వెల్లడించారు సెబీ ఛైర్ పర్సన్ మాధవీ పురి బచ్.

2024 మార్చి నాటికి స్టాక్ మార్కెట్ లో నిర్వహించే లావాదేవీల సెటిల్ మెంట్లను అదే రోజు పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక రోజులో సెటిల్ అయ్యే దాని స్థానంలో.. అదే రోజు సెటిల్ మెంట్లు చేయనున్నారు. ఇదే లక్ష్యంతో సెబీ పని చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. మరో ఏడాది వ్యవధిలో లావాదేవీలు నమోదైన వెంటనే అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ సెటిల్ మెంట్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

అంతే.. రియల్ టైం ప్రాతిపదికన లావాదేవీలు పూర్తి చేయాలన్నది సెబీ లక్ష్యమని పేర్కొన్నారు. అదే జరిగితే.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారి జోరు మరింతగా పెరుగుతుంది. అయితే.. ఈ ఇన్ స్టెంట్ సెటిల్ మెంట్ ఆలోచన మీద సలహాల్ని.. సూచనల్ని తాము ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెటిల్ మెంట్ ను ప్రస్తుతం అమలవుతున్న సెటిల్ మెంట్ వ్యవస్థను సమాంతరంగా అమలు చేయాలన్నది ఆలోచనగా చెప్పారు.

అంతేకాదు.. కొత్త విధానాన్ని కావాలంటే కోరుకునేలా.. అక్కర్లేదంటే పాత విధానంలో కంటిన్యూ అయ్యే ఆప్షన్ కూడా ఇవ్వనున్నారు. అంతేకాదు.. కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే ఇలాంటి ఆప్షన్ ఉండేలా చేయాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. చూస్తుంటే.. రానున్న రెండేళ్లలో స్టాక్ లావాదేవీలకు సంబంధించి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పకతప్పదు.