Begin typing your search above and press return to search.

ఇంకా నెల రోజులూ సొరంగంలోనేనా

కానీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో కార్మికులను బయటకు తెచ్చేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 Nov 2023 9:45 AM GMT
ఇంకా నెల రోజులూ సొరంగంలోనేనా
X

ఉత్తరాఖండ్ లోని ఉత్తరాకాశీలో నిర్మిస్తున్న సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చే ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 41 మంది కార్మికులు ఆ సొరంగంలో చిక్కుకుని 15 రోజులు కావొస్తోంది. ఈ నెల 12న దీపావళి రోజున ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కానీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో కార్మికులను బయటకు తెచ్చేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఉత్తరాఖండ్ లోని టన్నెల్ దగ్గర అసలు ఏం జరుగుతోంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని త్వరలోని కార్మికులు బయటకు వస్తారనే సూచనలు కనిపించినా.. ఈ సహాయ కార్యక్రమం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా క్రిస్మస్ సమయానికి కార్మికులు బయటకు వచ్చే అవకాశముందని అంతర్జాతీయ టన్నెల్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ చెబుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించే బాధ్యతను భారత ఆర్మీ తీసుకుంది. సమాంతర డ్రిల్లింగ్ తో కార్మికులను బయటకు తీసుకు రావచ్చిన అధికారులు భావించారు. అందుకే దేశంలోని అగర్ యంత్రాలతో పాటు అమెరికా నుంచి 25 టన్నుల అగర్ యంత్రం తెప్పించారు.

సొరంగంలో 60 మీటర్ల దూరంలో కార్మికులు చిక్కుకుపోగా అగర్ యంత్రంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 13 మీటర్లను తవ్వి పైపులు వేయాల్సి ఉంది. అయితే మాన్యువల్ గా ఈ పని చేయాలంటే నెలరోజుల సమయం పడుతుందని తెలిసింది. మరోవైపు నిలువుగా కూడా డ్రిల్లింగ్ చేస్తున్నారు. కానీ ఇది రిస్క్ తో కూడుకున్నదని చెబుతున్నారు. నిలువుగా అయితే కొండ మీద నుంచి 86 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇది అనుకున్నట్లుగా సాగితే మరో నాలుగు రోజుల్లో కార్మికులు బయటకు వచ్చే అవకాశముంది. అయితే డ్రిల్లింగ్ లో భారీ ఇనుప వస్తువులు అడ్డుపడుతుండటం ఇబ్బందిగా మారింది. పర్వత ప్రాంతంలో ఈ సహాయక కార్యక్రమం నిర్వహించడం సవాలుతో కూడిందే. మరోవైపు పైపుల ద్వారా కార్మికులకు ఆక్సిజన్, ఆహారం పంపిస్తున్నారు. కెమెరా పంపించి ఎప్పటికప్పుడూ మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిస్తున్నారు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, డీఆర్డీవో, వాయు సేన కూడా కలిసి కార్మికులను వీలైనంత త్వరగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.