‘స్త్రీశక్తి’ పవర్ ఇదే కదా! చంద్రబాబు పథకాన్ని ఎలా వాడేస్తున్నారా చూడండి
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 Sept 2025 2:00 AM ISTవ్యాపారం పెంచుకునేందుకు వాణిజ్య సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తగ్గింపు ధరలు, డిస్కౌంట్ సేల్ ఇలా చాలా ఆఫర్లే ఇప్పటి వరకు విని ఉంటారు. కానీ, తమ వ్యాపారం కోసం ఓ ప్రభుత్వ పథకాన్ని వినియోగించడం బహుశా ఇప్పటి వరకు చూసి ఉండరు. కానీ, ఏపీలో ఓ వస్త్ర వ్యాపార సంస్థ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన ‘స్త్రీశక్తి’ పథకాన్ని వాడేస్తోంది. ‘స్త్రీశక్తి’ టికెట్ చూపిన వారికి కారు చౌకగా చీర, నైటీ, దిండు విక్రయిస్తామని ఆఫర్ చేసింది. ఇంకేం ఉంది ఆఫర్ బాగుంది కదా అని మహిళామణులు ఆ దుకాణానికి క్యూకడుతున్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ‘షరతులు వర్తిస్తాయి’ అన్న మాట వినిపిస్తుండటంతో అంతా అవాక్కు అవుతున్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యం కల్పించారు. ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో మహిళల ఆదరణ బాగుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతం కంటే 30 శాతం అధికంగా మహిళల ఆక్కుపెన్సీ పెరగడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది.
గతంలో చిన్నచిన్న పనులు ఉంటే ఇంట్లో మగాళ్లే చూసుకునే వారు. కానీ, ఉచిత బస్సు అమలు అయిన తర్వాత ఎక్కువగా మహిళలే ఆ పనులు ముగించుకునేందుకు పట్టణాలకు వస్తున్నారు. అలా వచ్చిన వారు మార్కెట్ కు వెళుతూ ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అలా వచ్చిన మహిళలను ఆకట్టుకునేందుకు ఓ వ్యాపార సంస్థ భలే ఆఫర్ ఇచ్చింది. ‘స్త్రీశక్తి’ బస్సు టికెట్ చూపిస్తే రూ.29 కే చీర, రూ.39కే దిండు, రూ.49కే నైటీ అంటూ ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది.
మూడు కొనుగోలు చేసినా వంద కూడా ఖర్చు అవ్వదనే ఉద్దేశంతో వీడియో చూసిన వారు అంతా ఆ దుకాణానికి పరుగు తీస్తున్నారు. అయితే ఇలా వెళ్లిన వారికి సదరు వ్యాపార సంస్థ వీడియోలో మ్యూట్ చేసిన ‘షరతులు’ను చెబుతూ షాకిస్తున్నారు. ఉచితంగా బస్సులో వెళ్లి ఎంచక్కా కావాల్సిన అన్ని చీరలు కొందామని భ్రమించే వారు ఆ షరతులు విని అవాక్కు అవుతున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో చెప్పని విధంగా ఆ షరతులు ఉండటంతో ఏం టెక్నిక్ అయ్యా.. అంటూ నిట్టూరుస్తున్నారు.
‘స్త్రీశక్తి’ టికెట్ పట్టుకుని వెళ్లిన వారు తప్పనిసరిగా రూ.500 విలువైన దుస్తులు కొనాలనే నిబంధనతోపాటు ఆఫర్ చేసిన వస్త్రాల్లో ఏదో ఒకటే ఇస్తామని చెప్పడంతో ఆ వ్యాపర సంస్థ టెక్నిక్ కి షాక్ అవుతున్నారు. బస్సులో ఉచితంగా వెళుతున్న వారు.. షాపులో అడుగుపెట్టి ఊరికే వెనక్కి రాలేక ఏదో ఒకటి మార్కెట్ చేస్తున్నారు. దీంతో ఆ వ్యాపార సంస్థ కూడా బాగా సొమ్ము చేసుకుంటుందని మిగతా వ్యాపారులు అంటున్నారు. ఇక ఈ ఆఫర్ విని అక్కడికి వెళ్లిన వారు ‘సీఎం చంద్రబాబు గారి పథకాన్ని ఇలా కూడా వాడేస్తారా?’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
