Begin typing your search above and press return to search.

స్టార్ లింక్ ఇచ్చే కనెక్షన్లు అన్నేనా?

మస్క్ కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్ భారత్ లోకి అడుగు పెడుతున్న వేళ.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ లాంటి దేశీయ టెలికం సంస్థలకు వాటిల్లే ప్రమాదంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

By:  Tupaki Desk   |   29 July 2025 10:17 AM IST
స్టార్ లింక్ ఇచ్చే కనెక్షన్లు అన్నేనా?
X

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి.. ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో సంచలనంగా మారటమే కాదు.. ఆయనకు చెందిన టెస్లా కారు ఉండటం ఒక ఇమేజ్ గా మారటం తెలిసిందే. టెక్నాలజీ పరంగానే కాదు.. ఫీచర్ల పరంగానూ నెక్ట్స్ లెవల్ అన్నట్లు ఉండే ఆయన ప్రొడక్టులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే.

మస్క్ కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్ భారత్ లోకి అడుగు పెడుతున్న వేళ.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ లాంటి దేశీయ టెలికం సంస్థలకు వాటిల్లే ప్రమాదంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశాన్ని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒక సభ్యుడు ప్రశ్నించారు.దీనికి కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు

ప్రస్తుత సామర్థ్యాల్ని పరిగణలోకి తీసుకొని చూస్తే.. స్టార్ లింక్ సంస్థ భారత్ లో గరిష్ఠంగా 200 ఎంబీపీఎస్ వేగంతో కేవలం 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ కారణంగానే మన టెలికం కంపెనీలపై స్టార్ లింక్ ప్రభావం ఉందన్నఆయన.. ఈ సర్వీసు పొందాలంటే పెద్ద ఎత్తున రుసుము చెల్లించటమే కాదు.. ప్రతి నెలా రూ.3వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ లింక్ తో టెలికం కంపెనీలకు వచ్చే నష్టమేమీ ఉండదన్నారు.

ఇదే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ లో చైనా పరికరాల్ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలపైనా స్పందించారు. బీఎస్ఎన్ఎల్ సేవల్లో పూర్తిగా దేశీ సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పారు.అంతేకాదు.. 4జీ సర్వీసుల విస్తరణ పూర్తైందని..ప్రస్తుతం మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. స్టార్ లింక్ టార్గెట్ ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ ఎల్ కు పోటీగా మారి.. దాన్ని దెబ్బ తీస్తుందన్న వాదనలు జోరుగా వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నమైన ప్రకటనను మంత్రి పెమ్మసాని చేయటం గమనార్హం.