Begin typing your search above and press return to search.

ఏపీకి హ్యాండిస్తున్న స్టార్ క్యాంపెయినర్లు

ఈ నేపథ్యంలోనే ఏపీలో సాధించే సీట్లు ఏ రాజకీయ పక్షానికైనా కీలకమే అనుకోవాలి.

By:  Tupaki Desk   |   8 May 2024 1:30 AM GMT
ఏపీకి హ్యాండిస్తున్న స్టార్ క్యాంపెయినర్లు
X

దేశంలో లోక్ సభా స్థానాల పరంగా పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. యూపీ (80), మహారాష్ట్ర (48), బెంగాల్ (42), బిహార్ (40), గుజరాత్ (26), కర్ణాటక (28), మధ్యప్రదేశ్ (29), తమిళనాడు (39) తర్వాత ఏపీనే. రాజస్థాన్ సమానంగా ఆంధప్రదేశ్ లో 25 లోక్ సభా స్థానాలు ఉన్నాయి. వివిధ రాజకీయ సమీకరణాల్లో ఒకవేళ దేశంలో హంగ్ ఏర్పడితే.. వైసీపీ, తెలుగుదేశం వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. పైన చెప్పుకొన్న మిగతా అన్ని రాష్ట్రాల్లో (తమిళనాడు మినహా) కాంగ్రెస్ లేదా బీజేపీ బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో సాధించే సీట్లు ఏ రాజకీయ పక్షానికైనా కీలకమే అనుకోవాలి.

ప్రాంతీయ పార్టీల అడ్డా

40 ఏళ్ల కిందట పుట్టిన టీడీపీ, 13 ఏళ్ల క్రితం ఏర్పాటైన వైసీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రం ఏపీ. అంతేకాదు.. ప్రస్తుతం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏకైక పెద్ద రాష్ట్రం. కాగా, ఏపీలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపాన్ని మూటగట్టుకుంది. తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరమైంది. ఏపీలో మాత్రం సమీప భవిష్యత్ లో పవర్ లోకి వచ్చే చాన్సు లేదు. అయితే, మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెను అనూహ్యంగా పీసీసీ అధ్యక్షురాలిని చేసి ఏపీ రాజకీయాల్లో మళ్లీ పైకి లేవాలని చూస్తోంది. ఈ ప్రయత్నం సంగతేమో కానీ.. ఆ రాష్ట్రానికి ప్రచారానికి పేరున్న నాయకులే కరవు అవుతున్నారు.

షర్మిల ఒక్కరేనా?

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్న ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది స్పష్టంగానే తెలుస్తోంది. షర్మిల ఒక్కరే ఆ పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. ఆరు నెలల కిందట తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడి నాయకులు కొందరని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది హస్తం పార్టీ.

15 రోజులైనా పత్తా లేరు?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ గత నెల 25నే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మందిలో తెలంగాణ నుంచి 11 మంది ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు తదితరులు వీరిలో ఉన్నారు. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్, మరో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ నూ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన వీరికి ఈ అవకాశం ఇచ్చింది. సీఎం రేవంత్ క్రేజు దృష్టిలో ఉంచుకొని ఏపీకి సమయం కేటాయించాలని హైకమాండ్ చెప్పింది.

ఏపీలో ఫాయిదా లేదనేనా?

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీతోపాటు తెలంగాణ ఎన్నికలను సమన్వయం చేసుకొని ముఖ్య నేతలు ప్రచారం చేయాలి. అయితే, వీరెవరూ ఏపీకి వెళ్లే ఉద్దేశంలో కనిపించడం లేదు. కేవలం తెలంగాణపైనే ఫోకస్ పెట్టారు. ఏపీలో ఎలాగూ పార్టీకి విజయావకాశాలు లేవనో? ఏమో ఆ రాష్ట్రంలో ఇంతవరకు ప్రచారమే చేయలేదు. లేదా తెలంగాణలో హోరాహోరీగా ముక్కోణపు సమరం జరుగుతున్నందున ఇక్కడే సమయం సరిపోదని భావిస్తున్నారో ఏమో? మొత్తానికి ఏపీ దిక్కు చూడడం లేదు.

నాలుగు రోజులే మిగిలింది..

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. అంటే కేవలం నాలుగు రోజులే ఉంది. ఈ నాలుగు రోజుల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరైనా ఆ రాష్ట్రానికి వెళ్తారా? లేదా? అనేది చూడాలి.