ప్రైవేట్ పార్ట్స్ పై జోకులా? వినోదం పేరిట వెకిలీ చేష్టలు.. ఈ లేడీ డాక్టర్ బుక్కైందిలా..
వైద్య వృత్తిని దైవంతో సమానంగా చూస్తాం. కానీ డాక్టర్ సెజల్ పవార్ అనే మహిళా వైద్యురాలికి మాత్రం మార్చురీలో ఉన్న శవాలు కూడా కామెడీ పీసుల్లా కనిపించాయి.
By: A.N.Kumar | 12 Jun 2026 10:48 AM ISTమైక్ దొరికితే చాలు.. నోటికి ఏదొస్తే అది వాగేయడం... దానికి 'స్టాండ్‌అప్ కామెడీ' అని ఒక కలర్ ఫుల్ బోర్డు తగిలించడం... ఇదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. వినోదం పంచడం చేతకాక, వివాదాలతో వ్యూస్ పెంచుకోవాలని చూసే కొందరు 'కళాకారుల' నిర్వాకం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల దాకా చేరింది. తాజాగా మహారాష్ట్ర సైబర్ సెల్ ఇలాంటి ముగ్గురు మేధావులపై కేసులు నమోదు చేసి అసలైన కామెడీ చూపించింది..
మార్చురీలో 'జోకులు'.. డాక్టర్ గారి హాస్య చతురత!
వైద్య వృత్తిని దైవంతో సమానంగా చూస్తాం. కానీ డాక్టర్ సెజల్ పవార్ అనే మహిళా వైద్యురాలికి మాత్రం మార్చురీలో ఉన్న శవాలు కూడా కామెడీ పీసుల్లా కనిపించాయి. ఒక స్టాండ్‌అప్ కామెడీ షోలో ఆమె మాట్లాడుతూ... మార్చురీకి వచ్చే పురుషుల మృతదేహాల వ్యక్తిగత అవయవాల మీద తాము జోకులు వేసుకుంటామంటూ తెగ నవ్వేసింది. చనిపోయిన వారిపై కనీస గౌరవం లేని ఈ వికృత హాస్యాన్ని చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. డాక్టర్ గారూ... చదువుకున్న చదువుకు, చేసే పవిత్రమైన వృత్తికి మీరు ఇచ్చిన గౌరవం ఇదా? అని చెడుగుడు ఆడేసరికి రూట్ మార్చి 'క్షమాపణలు' కోరారు. పాపం ప్రణీత్ మోరే అనే మరో కమెడియన్ కూడా ఈమెతో కలిసి మైక్ ముందు విన్యాసాలు చేసి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుపోయారు.
రూ.370 బిర్యానీ... అంతకు మించిన 'మహా మేధావి'!
ఇక గురుగ్రామ్‌కు చెందిన ఐటీ ఉద్యోగి హిమాన్షు జంగ్రా వేసిన 'బిర్యానీ జోక్' వింటే... వీడికి ఐటీ ఉద్యోగం ఎలా ఇచ్చారా అనిపిస్తుంది. ఒక అమ్మాయికి రూ.370 పెట్టి బిర్యానీ కొనిచ్చాడట. దానికి ప్రతిగా తాను ఏం ఆశిస్తానో అందరికీ తెలుసంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంటే రూ.370 బిర్యానీకే మహిళల ఆత్మగౌరవాన్ని కొనేయవచ్చనేది ఈయన గారి అద్భుతమైన భావన కాబోలు.. ఈ చీప్ మెంటాలిటీపై నెటిజన్లు ఉమ్మేసేసరికి అతడు పనిచేసే ఐటీ సంస్థ సగర్వంగా అతడిని ఉద్యోగం నుంచి పీకేసింది. ఇప్పుడు బిర్యానీ లేదు... ఉద్యోగమూ లేదు..
సీన్‌లోకి ఎన్‌సీడబ్ల్యూ , సైబర్ సెల్
ఈ చెత్త కామెడీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సుమోటోగా కేసు స్వీకరించి ప్రణీత్ మోరే, హిమాన్షు జంగ్రాలకు గట్టి నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్ర సైబర్ సెల్ కూడా రంగంలోకి దిగి వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేసింది.
బాధ్యత లేని స్వేచ్ఛ... జైలుకే దారి!
స్టాండ్‌అప్ కామెడీకి, భావప్రకటన స్వేచ్ఛకు ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ, నవ్వించడం చేతకాక మహిళలను కించపరచడం, మృతదేహాలను అవమానించడం హాస్యం అనిపించుకోదు, పైశాచికత్వం అనిపించుకుంటుంది.
మైక్ ఉంది కదా అని హద్దులు దాటి వాగితే చట్టం తన స్టాండ్‌అప్ కామెడీని చూపిస్తుంది. ఇప్పటికైనా ఈ సోకాల్డ్ కమెడియన్లు హద్దుల్లో ఉంటే మంచిది.. లేదంటే సైబర్ సెల్ పోలీసులు స్టేషన్‌లో కూర్చోబెట్టి 'సిట్ డౌన్' కామెడీ నేర్పించడం ఖాయం!
