Begin typing your search above and press return to search.

తమిళనాట మళ్లీ స్టాలిన్‌..? మరి విజయ్‌ పరిస్థితి ఏమిటి?

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికల్లోనూ మళ్లీ స్టాలిన్‌కే పట్టం అని లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల సర్వేలో వెల్లడైందట.

By:  Tupaki Desk   |   24 Jun 2025 4:15 AM IST
తమిళనాట మళ్లీ స్టాలిన్‌..? మరి విజయ్‌ పరిస్థితి ఏమిటి?
X

దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల రాజకీయం ఒక ఎత్తు.. తమిళనాడు రాజకీయం మరో ఎత్తు.. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక.. ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్‌ లేదా బీజేపీ ఏదో ఒక జాతీయ పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నాయి. తమిళనాడులో మాత్రం జాతీయ పార్టీలు ఏదో ఒక ప్రాంతీయ పార్టీపై ఆధారపడాల్సిందే. ఈ రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజ్యం. 2016 వరకు ఒకసారి నువ్వు, ఒకసారి నేను అనేలా చెరో ఎన్నికల్లో గెలిచేవి. ఆ సంవత్సరం మాత్రం వరుసగా రెండోసారి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే గెలుపొంది రికార్డు నెలకొల్పింది. కానీ, అధినేత్రి జయలలిత మరణంతో బలహీనపడిన ఆ పార్టీని ఎంకే స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే 2021లో చిత్తుగా ఓడించింది. ఇక ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు తమిళనాడులో ప్రధాన తేడా.. కొత్త రాజకీయ పార్టీ రావడం. అదికూడా సాదాసీదా వ్యక్తి పార్టీ కాదు. ఎంతో ప్రజాభిమానం ఉన్న హీరో విజయ్‌ రెండేళ్ల కిందట టీవీకే పేరిట పార్టీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికలు డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు తోడు టీవీకే పోటీ పడనుంది. మరి ఈ ముక్కోణపు పోటీలో గెలుపు ఎవరిది?

సూర్యోదయం ఖాయమే..?

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికల్లోనూ మళ్లీ స్టాలిన్‌కే పట్టం అని లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల సర్వేలో వెల్లడైందట. ఈ సర్వేలో 77.83 శాతం అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం పనితీరు, ప్రజల సమస్యలు పరిష్కరించే పార్టీలు తదితర 10 పైగా ప్రధాన ప్రశ్నలతో రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో చెన్నైలోని లయోలా పూర్వ విద్యార్థుల ‘ఇండియా అరసియల్‌ జననాయగ యుక్తిగళ్‌’ సంస్థ సర్వే చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5-జూన్‌ 17 మధ్య 70,922 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వే ప్రకారం..

సీఎంగా 77.83 శాతం మంది స్టాలిన్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. చిత్రం ఏమంటే.. తర్వాతి స్థానాల్లో విజయ్‌ కాకుండా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఉండడం. వీరి తర్వాత విజయ్, ఎన్టీకే చీఫ్‌ కన్వీనర్‌ సీమాన్, పీఎంకే నేత అన్బుమణి, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పన్నీర్‌సెల్వం, ఏఎంఎంకే ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ నిలిచారు.

-ఇప్పటికిప్పుడు అయితే తాము డీఎంకేకే ఓటు వేస్తామని 17.7 శాతం మంది చెప్పారు. అయితే, అన్నాడీఎంకేకూ దీనికి దగ్గరదగ్గరగా 17.3 శాతం మంది ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. విజయ్‌ పార్టీ టీవీకే 12.20 శాతం మంది ఓటు వేస్తామని తెలిపారు. ఎన్టీకే (6), బీజేపీ (5), పీఎంకే (4.9), కాంగ్రెస్‌ (3.10), డీఎండీకే (2.5), వీసీకే (2), లెఫ్ట్‌ పార్టీలు (1.4) నిలిచాయి. కాగా, 10.16 శాతం మంది ఇతర పార్టీలకు, 6 శాతం మంది ఎవరికీ ఓటు వేయమని చెప్పారు.

-కూటముల‍్లో ఎవరికి మీ ఓటు అని అడగ్గా 33.60 శాతం మంది డీఎంకే, కాంగ్రెస్, వీసీకే వైపు మొగ్గుచూపారు. 28.70 శాతం అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమికి, 25.3 శాతం టీవీకే, ఎన్టీకే కూటమికి మద్దతు పలికారు.

అన్నామలైకు మంచి భవిష్యత్‌..

తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటివరకు వ్యహరించి.. బీజేపీని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లిన అన్నామలైకు ప్రజాదరణ బాగా ఉన్నట్లు తేలింది. భవిష్యత్తులో ఏ నాయకుడి చేతిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ప్రశ్నకు చాలామంది అన్నామలైను ఎంచుకోవడం గమనార్హం. రెండో స్థానంలో విజయ్, మూడో స్థానంలో ఉదయనిధి, నాలుగో స్థానంలో సీమాన్‌ ఉన్నారు. ఈ ప్రకారం చూస్తే.. విజయ్‌ ఇంకా చాలా కష్టపడాల్సి ఉందని తెలుస్తోంది.