ప్రత్యేక ద్రవిడ దేశం...స్టాలిన్ డిమాండ్ వెనక ఏముంది ?
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ఈ కమిటీ రాష్ట్ర జాబితా నుండి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాకు అంశాలను మార్చడం, విద్య ఆరోగ్యం వంటి అంశాలను పరిశీలిస్తుంది.
By: Tupaki Desk | 19 April 2025 5:00 AM ISTతమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పేచీలు పడుతూ రాష్ట్రాల హక్కుల కోసం పోరాటంగా దానిని మార్చిన నేపథ్యం ఉంది. ఆయన జాతీయ విద్యా విధానం మీద మొదట నిరసన తెలిపారు. దక్షిణాది మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆగ్రహించారు. తమిళనాడు హిందీని వ్యతిరేకిస్తోంది అని ఎలుగెత్తి చాటారు.
ఆ తరువాత్ జాతీయ పరీక్ష అయిన నీట్ ని ఆయన వ్యతిరేకించారు. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి కేంద్రం ఏర్పాటు చేసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను తమిళనాడు వ్యతిరేకించడం కూడా తోడు అయింది. ఆ మీదట డీలిమిటేషన్ మీద గొంతు పెద్దది చేశారు. ఇది దక్షిణాది రాష్ట్రాల హక్కులను హరిస్తుంది అని కూడా ఆయన తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఏకంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలసి కీలక సమావేశం నిర్వహించి కేంద్రం మీద ద్వజమెత్తారు.
ఇపుడు ఇది చాలదు అన్నట్లుగా ఆయన ఏకంగా తమిళనాడుకు స్వయంప్రతిపత్తి డిమాండ్ ని అందుకున్నారు. ఇది సరికొత్త డిమాండ్ కాదు, గతంలో డీఎంకే నుంచి వచ్చినదే. అయితే దానికి అర్ధ శతాబ్దం చరిత్ర ఉంది. ఆనాడు కరుణానిధి ఈ డిమాండ్ ని వినిపిస్తే ఇపుడు ఆయన తనయుడు స్టాలిన్ దానిని అందుకున్నారు.
తాజాగా స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడటానికి తీసుకునే చర్యలను సమీక్షించి సిఫార్సు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీసుకున్న నిర్ణయం జాతీయ వివాదానికి దారి తీసేలా ఉంది.
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ఈ కమిటీ రాష్ట్ర జాబితా నుండి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాకు అంశాలను మార్చడం, విద్య ఆరోగ్యం వంటి అంశాలను పరిశీలిస్తుంది. అలాగే నీట్ మీద జాతీయ విద్యా విధానం మీద కూడా ఈ కమిటీ సమీక్షిస్తుంది. అంతే కాదు గతంలో సర్కారియా పూంచీ కమిషన్లు రాష్ట్రాల అధికారాలు హక్కులకు సంబంధించి చేసిన సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించి స్టాలిన్ ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదిక ఇస్తుంది.
దానిని బట్టి తమిళనాడు ప్రభుత్వం డీఎంకే రాజకీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే తమిళనాడు రాష్ట్ర సారధి స్టాలిన్ స్వయం ప్రతిపత్తి అంటూ చేస్తున్న డిమాండ్ వెనక ఉద్దేశ్యం ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ప్రత్యేక్ ద్రవిడ దేశం డిమాండ్ కి దారి తీస్తుందా అన్న చర్చ సాగుతోంది.
రాష్ట్రాలకు హక్కులు కావాలని అడగడంలో తప్పు లేదు, అలాగే విధులు నిధులు ఇంకా ఎక్కువగా కోరుతూ పెంచమనడంలో తప్పు లేదు. కానీ మా పద్ధతులు వేరు మా సంస్కృతి వేరు అని వేరు పడే విధంగా వ్యవహరించడం మంచిది కాదని అంటున్నారు. స్వయంప్రతిపత్తిని జమ్మూ అండ్ కాశ్మీర్ కే తొలగించిన నేపథ్యంలో స్టాలిన్ తమిళనాడు నుంచి ఈ తరహా డిమాండ్ చేయడం వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల కోసం ఎత్తుగడా లేక ద్రవిడ ఉద్యమానికి స్పూర్తిగా తీసుకుని కొనసాగింపుగా చేసే వ్యవహారమా అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే కనుక స్టాలిన్ డిమాండ్ మీద అంతా చర్చించుకుంటున్నారు.
కేంద్రం కూడా రాష్ట్రాల విషయంలో మరిన్ని అధికారాలు ఇచ్చే విధంగా వ్యవహరించాల్సి ఉంది అని అంటున్నారు. అలాగే వివక్ష చూపడం వల్ల కూడా విభేదాలు పెరిగి చివరికి అవి వేర్పాటు వాద డిమాండ్లకు దారి తీస్తాయని అంటున్నారు.
మరో వైపు చూస్తే స్టాలిన్ తాజాగా మరింతగా స్వరం పెంచారు. డీలిమిటేషన్ వల్ల లోక్ సభ స్థానాలు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును విముక్తి చేయాలని కోరారు. తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయరాదని అన్నారు. మొత్తానికి స్టాలిన్ కేంద్రం మీద బీజేపీ పెద్దల మీద నిప్పులు చెరుగుతున్నారు.
