మనిషిని లక్షాధికారిని చేసే కీటకం... దీని గురించి తెలుసా?
అవును... ప్రపంచంలోనే అరుదైన కీటకాల్లో స్టాగ్ బీటిల్ కు మొదటి స్థానం ఉంటుందని చెబుతుంటారు.
By: Tupaki Desk | 19 July 2025 6:00 AM ISTప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం ఒకటి ఉంది.. అది ఎవరినైనా కుడితే ఏమవుతుందనే సంగతి కాసేపు పక్కనపెడితే... అది దొరికితే మాత్రం మీరు లక్షాధికారి అయిపోయినట్లే! దీని పేరు స్టాగ్ బీటిల్ కాగా... దీని ధర అక్షరాలా రూ.75 లక్షలు అని చెబుతున్నారు. ఇది మనదేశంలోనూ నాలుగైదు రాష్ట్రాల్లో దొరికే అవకాశం ఉంది.
అవును... ప్రపంచంలోనే అరుదైన కీటకాల్లో స్టాగ్ బీటిల్ కు మొదటి స్థానం ఉంటుందని చెబుతుంటారు. ఈ కీటకాన్ని ఔషధ వినియోగంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ఔషధ తయారీదారులు దానికి అంత ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. ఈ కీటకం భారత్ లో రూ.75 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది అడవులలోనే కనిపిస్తాయని అంటున్నారు.
ఇతర కీటకాల మాదిరిగానే కాలినడకన, రెక్కల ద్వారా ప్రయాణించే ఈ స్టాగ్ బీటిల్.. చెట్ల రసాన్ని తింటాయి. ఇవి ఉత్తర భారతదేశం, ఆగ్నేయాసియాలోని దట్టమైన ఉష్ణమండల, ఉప ఉష్ణమండల అడవులకు చెందినవిగా చెబుతారు. ఈ కీటకాలు సహజ ఆవాసాలైన చెట్లతో కూడిన ప్రదేశాలలో కనిపిస్తాయి. ఈ స్టాగ్ బిటిల్ లలో మగవాటికి ఎక్కువ డిమాండ్, ధర ఉంటుందని అంటున్నారు.
మగ స్టాగ్ బీటిల్ గూబలు లోతుగా ఉండి కొమ్ములు పొడవుగా ఉండగా.. ఆడవాటికి గూబలు ఎత్తుగా ఉండి కొమ్ములు పొట్టిగా ఉంటాయి. అయితే... ఆడ కీటకాల కంటే మగవాటిలోనే ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని.. అందుకే దాని ధర ఎక్కువగా పలుకుతుందని చెబుతుంటారు. 1,200 కంటే ఎక్కువ జాతులను కలిగి ఉన్న లుకానిడే కుటుంబానికి చెందిన ఈ కీటకాలు 35 నుండి 75 మి.మీ పొడవు ఉంటాయి!
ఇంతటి అరుదైన, విలువైన కీటకం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. గత ఏడాది ఆగస్టులో అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలంలోని కోనాం పంచాయితీ శివారు కొత్త వీధిలో ప్రత్యక్షమయ్యాయి.
ఆ గ్రామానికి చెందిన గేమ్మెలి చంటి అనే ఆదివాసి గిరిజనుడు ఇటీవల అటవీ ప్రాంతానికి వెళ్లడంతో స్టాగ్ బిటిల్ కనిపించింది. ఈ కీటకం వింతగా కనిపించడంతో దాన్ని పట్టుకొని ఆకుల్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం పలువురికి తెలియడంతో.. ఆ కీటకాన్ని చూసి స్టాగ్ బీటీల్ గా గుర్తించారు.
