సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు.. ఎఫ్‌ఐఆర్ లో కీలక విషయాలు!
అవును... సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఎఫ్‌ఐఆర్ లో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు.
By: Tupaki Desk | 27 July 2025 5:47 PM ISTసికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో అద్దె గర్భాల కోసం అక్రమంగా అండాలను, వీర్యాన్ని సేకరిస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని.. అనుమతులు లేకుండానే ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్.ఐ.ఆర్ లో కీలక విషయాలు వెల్లడించారు!
అవును... సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఎఫ్‌ఐఆర్ లో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఐవీఎఫ్ కోసం డాక్టర్ నమ్రతను రాజస్థాన్ కు చెందిన దంపతులు గోవింద్ సింగ్, సోనియా గతేడాది ఆగస్టులో సంప్రదించారు. ఈ క్రమంలో టెస్టుల కోసం రూ.66 వేలు తీసుకున్న డాక్టర్... సరోగసీకి వెళ్లమని వాళ్లకు సూచించారు. దీనికోసం రూ.30 లక్షలు అవుతుందని చెప్పారు.
ఈ సమయంలో... దంపతుల వీర్యం, అండం తీసుకొని సరోగసీ చేస్తామని తెలిపారు. దీనికోసం రూ.15లక్షల నగదు, మరో రూ.15లక్షలకు చెక్కు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో రూ.5 లక్షలు నమ్రత ఖాతాకు రాజస్థాన్ దంపతులు బదిలీ చేశారు. దీంతో... సెప్టెంబర్ లో దంపతులను విశాఖకు పిలిపించి.. వారి నుంచి వీర్యం, అండం సేకరించారు.
అనంతరం... సరోగసీ విజయవంతంగా ప్రారంభించామని చెప్పి.. మరికొంత నగదు నమ్రత తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలనాటికి మొత్తం నగదును దంపతులు చెల్లించారు. మరోవైపు సరోగసీకి అంగీకరించిన మహిళ భర్త రూ.3.5లక్షలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పడంతో రూ.2.50లక్షలు ఈ దంపతులు చెల్లించారు.
ఆ డబ్బులు చెల్లించిన తర్వాత విశాఖపట్నంలోని డాక్టర్ కల్యాణి.. ఈ దంపతులకు బిడ్డను చూపించారు. ఈ సమయంలో... అగ్రిమెంట్ ప్రకారం బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరారు. అయితే తొలుత అందుకు అంగీకరించిన డాక్టర్ నమ్రత.. అనంతరం నిరాకరించారు. దీంతో.. బిడ్డకు ఢిల్లీలో డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా.. ఆ బిడ్డ తమది కాదని దంపతులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో... ఈ శిశువును అసలైన తల్లిదండ్రులకు ఇవ్వాలని వారు తెలిపారు. ఈ క్రమంలో నమ్రత.. బాధితుల ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశారు. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డా.నమ్రత, సిబ్బందిపై పలు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పిల్లల అక్రమ విక్రయం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.
