సృష్టి కేసులో సంచలన విషయాలు.. మరిన్ని అక్రమాలు..?
ఇటీవల ఒక గృహిణి తన బాబుకు క్యాన్సర్ సోకిందని డీఎన్ఏ టెస్టుకు పట్టుబట్టింది.
By: Tupaki Desk | 4 Aug 2025 5:00 PM ISTమాతృత్వంను ప్రతీ గృహిణి ఆస్వాదించాలనే ఆరాటపడుతుంది. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. కొందరిలో భర్తలో లోపం ఉండడం, మరికొందరిలో భార్యలో లోపం.. ఇలా మాతృత్వానికి దూరం అయ్యే వారు చాలా మంది ఉన్నారు. ఇందులో కొందరు అనాథాశ్రయం నుంచి పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటే.. మరికొందరు తన రక్తబంధమే కావాలని కోరుతుంటారు. వారి ఆనందాలను, కలలను నిజం చేసేందుకే ఫెర్టిలిటీ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లు చాలా మంది గృహిణులను అమ్మలను చేశాయి. కొందరు మాతృత్వం వరంగా ప్రసాదిస్తామని ఫెర్టిలిటీ సెంటర్లు నడిపిస్తుంటే.. మరికొందరు వ్యాపారంగా నడుపుతూ దంపతులను కష్టాల్లోకి నెడుతుంటారు. ఇటీవల హైదరాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వెలుగులోకి రావడంతో సంచలన విషయాలు బయటకువచ్చాయి.
అసలు విషయం బయటపడింది ఇలానే..
ఇటీవల ఒక గృహిణి తన బాబుకు క్యాన్సర్ సోకిందని డీఎన్ఏ టెస్టుకు పట్టుబట్టింది. ఈ డీఎన్ఏ టెస్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తన భర్త, తన డీఎన్ఏతో బాబు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో కేసు బయటకు వచ్చింది. ఈ కేసు నడుస్తుండగానే మరో నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఐవీఎఫ్ కు వచ్చిన తమకు సరోగసి పేరిట డబ్బులు తీసుకున్నారని కేసులో పేర్కొన్నారు. ఈ మేరకు గోపాలపురం పీఎస్ లో 4 కేసులు నమోదయ్యాయి. వారి మెడికల్ రిపోర్టులు తీసుకువచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.
లక్షలాది రూపాయలు దండుకున్న తీరిది..
తాము ఐవీఎఫ్ కోసం వస్తే సరోగసిని చూపి తమ వద్ద ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత రూ. 44 లక్షల వరకు తీసుకుందని బాధితులు పేర్కొన్నారు. దీనితో పాటు హైదరాబాద్ కు చెందిన ఒక గృహిణికి సరోగసి చేస్తానని హార్మోన్ ఇంజిక్షన్ ఇచ్చిందని తెలిపింది. ఇలా హాస్పిటల్ కు చెందిన నమ్రతతో పాటు కల్యాణి, సదానందం, చెన్నారావు, సురేఖ, అర్చన, శేషగిరి, శ్రీనివాస్ లపై కేసులు నమోదయ్యాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గ్యాంగ్ ఎన్ఆర్ఐలను కూడా వదల్లేదని ఫిర్యాదులను చూస్తే తెలుస్తోంది. ఒక ఎన్ఆర్ఐ ఈ ఫెర్టిలిటీ సెంటర్ పై ఫిర్యాదు చేసింది. తమ వద్ద నుంచి రూ. 25 లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా చాలా వరకు కేసులు నమోదయ్యాయి. కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
వణుకుతున్న గృహిణులు
సృష్టి భాగోతం బయటపడడంతో ఫెర్టిలిటీ సెంటర్ అంటేనే పిల్లలు లేని గృహిణిలు వణుకుతున్నారు. తమకు మాతృత్వం కల్పిస్తామని నమ్మ బలికి ఇలాంటి పనులకు ఒడిగడుతున్న సెంటర్ల విషయంలో తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలకు లక్షలు డబ్బులను దండుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏది ఏమైనా సృష్టి కేసు నగరంతో పాటు రెండు రాష్ట్రాలను కదిలించింది. ఎన్ఆర్ఐలు కూడా సృష్టి పేరు చెప్తేనే జంకుతున్నారు.
