SRM యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాజధాని అమరావతిలో ఉన్న SRM యూనివర్సిటీకి ప్రభుత్వం 20 రోజుల సెలవులు ప్రకటించింది.
By: Tupaki Desk | 7 Nov 2025 5:51 PM ISTరాజధాని అమరావతిలో ఉన్న SRM యూనివర్సిటీకి ప్రభుత్వం 20 రోజుల సెలవులు ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం వర్సిటీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూడటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సన్హా నేతృత్వంలోని ఆరుగురు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
హాస్టల్ నిర్వహణ సరిగా లేకపోవడమే విద్యార్థుల అస్వస్థతకు కారణంగా సబ్ కలెక్టర్ అంజనా సిన్హా నేతృత్వంలోని కమిటీ గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో యూనివర్సిటీని సందర్శించిన అధికారుల బృందం ఫుడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. వర్సీటికి సరఫరా అవుతున్న నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యతను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సబ్ కలెక్టర్ కోరారు.
తాజా పరిణామాల నేపథ్యంలో వర్సిటీని రెండు వారాలు పాటు మూసేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. దీంతో శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ప్రకటన జారీ చేశారు. వర్సిటీ ప్రాంగణం మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ యాజమాన్యం మరో ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి భిన్నంగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది.
కాగా, నాలుగు రోజుల క్రితం వర్సిటీలో ఆహారం వల్ల సుమారు 300 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయించారు. ఈ విషయం బయటకు రావడంతో వర్సిటీ యాజమాన్యం హడావుడి చేయడం మొదలుపెట్టింది. వర్సిటీకి చెందిన ఓ ఉద్యోగి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ తరహా సంఘటనలు చోటుచేసుకోవడంతో హాస్టల్ మెస్ లో లోపాలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో వర్సిటీపై సమగ్ర అధ్యయనం చేయాలని భావించిన ప్రభుత్వం, ముందుగా విద్యార్థులను ఇళ్లకు పంపి కాపాడాలని నిర్ణయించింది.
