Begin typing your search above and press return to search.

దక్షిణ కాశీకి ఎలివేటెడ్‌ కారిడార్‌!

ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి నిత్యం వేలల్లో భక్తులు తరలివస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 March 2024 9:23 AM GMT
దక్షిణ కాశీకి ఎలివేటెడ్‌ కారిడార్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీశైలం. అంతేకాకుండా 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.. శ్రీశైలం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి నిత్యం వేలల్లో భక్తులు తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖ శైవక్షేత్రమయిన శ్రీశైలానికి వంతెన మార్గం (ఎలివేటెడ్‌ కారిడార్‌) నిర్మించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాజాగా లేఖ రాశారు. దక్షిణ కాశీగా వాసికెక్కిన శ్రీశైలం క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుంచి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే రవాణా మార్గం సరిగా లేదన్నారు.

191.1 కిలోమీటర్ల 765 నంబర్‌ జాతీయ రహదారి హైదరాబాద్‌ నగరాన్ని శ్రీశైలంతో అనుసంధానిస్తోందని ఎన్వీ రమణ ఆ లేఖలో ప్రధానికి తెలిపారు. ఇందులో 62.5 కిలోమీటర్ల మార్గం నల్లమల పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోకే వస్తోందన్నారు. దీంతో ఈ రోడ్డు వెడల్పు 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు మాత్రమే ఉంటోందని వివరించారు. ఇంతటి ఇరుకుదారిలో రోజూ 30 వేల మందికి పైగా భక్తులు రాకపోకలు సాగించాల్సి వస్తోందని వెల్లడించారు. ఇక పండగల సీజన్‌ లో అయితే ఈ సంఖ్య రోజుకు లక్ష దాకా ఉంటోందని తెలిపారు.

శ్రీశైలానికి వెళ్లాలంటే నల్లమల అడవి గుండా వెళ్లాల్సి ఉంటుందని.. ఈ మార్గమంతా పిట్టగోడలు, ఇరుకైన వంతెనలు, ప్రమాదకరమైన మలుపులు, లోయలు, వంపులు, ఏటవాలుతో ఉందని ఎన్వీ రమణ వివరించారు. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటోందని తెలిపారు.

శ్రీశైలానికి వెళ్లే మార్గం పులుల సంరక్షణ కేంద్రం గుండా వెళ్తోందని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. కాబట్టి ఇక్కడ వంతెన మార్గం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయన్నారు. అంతేకాకుండా వన్యప్రాణులకు కూడా ముప్పు తప్పుతుందన్నారు.

ప్రధాని మోదీ వ్యక్తిగత చొరవతోనే వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ సాధ్యమైందని ఎన్వీ రమణ లేఖలో పేర్కొన్నారు. మీరు (ప్రధాని మోదీ) చొరవ చూపితే దక్షిణ కాశీ ప్రాజెక్టూ సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై గత ఏడాది ఫిబ్రవరిలో తానున రాసిన లేఖకు కేంద్ర రహదారి, రవాణా శాఖ కార్యదర్శి స్పందించారన్నారు.

శ్రీశైలం మార్గాన్ని మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ కోసం కన్సల్టెంట్‌ ను నియమించినట్లు మే 24న తనకు కేంద్ర రహదారి, రవాణా శాఖ కార్యదర్శి సమాధానం పంపారన్నారు. ఈ నేపథ్యంలో మీరు (ప్రధాని మోదీ) కూడా మరోసారి దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. శివరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం తెలుగు రాష్ట్రాల భక్తులకు దీన్నో బహుమతిగా ప్రకటిస్తే సంతోషకరంగా ఉంటుంది అని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రధానికి రాసిన లేఖలో విన్నవించారు.