శివస్వాములపై లాఠీచార్జి.. బీజేపీ సీరియస్, ఏఎస్పీపై వేటు?
శ్రీశైలంలో గత సోమవారం శివస్వాములపై లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంటోంది.
By: Tupaki Political Desk | 11 Feb 2026 3:01 PM ISTశ్రీశైలంలో గత సోమవారం శివస్వాములపై లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంటోంది. ఈ అంశంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి మాలాధారణలో ఉన్న వారిని దేవుడి ప్రతిరూపంగా భావిస్తామని, అలాంటి వారిపై లాఠీ చార్జి చేయడాన్ని తమ పార్టీ ఖండిస్తుందని మాధవ్ ప్రకటించారు. కూటమిలో కీలక భాగస్వామ్యపక్షమైన బీజేపీ లాఠీచార్జిపై ఘాటుగా స్పందించడంతో ప్రభుత్వం ఈ విషయంపై అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో లాఠీచార్జికి కారణమైన పోలీసు అధికారులపై చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం. దీనికి 15 రోజుల ముందుగానే భక్తులు మల్లన్నను దర్శించుకుంటారు. శివమాలలు ధరించిన వారు స్వామి దర్శనం చేసుకున్న అనంతరం దీక్ష విరమిస్తారు. అత్యంత కఠిన దీక్షతో ఆలయానికి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని అంటున్నారు. అయితే గత సోమవారం వేల మంది భక్తులు తరలిరావడం, అందుకు తగ్గ సదుపాయాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమవడంతో భక్తులు ఆందోళనకు దిగారు.
వేల మంది భక్తులు ఆలయ ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, తొక్కిసలాట చోటుచేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు భక్తులను వారించే క్రమంలో లాఠీ చార్జి చేశారు. నంద్యాల ఏఎస్పీ యుగంధర్ రెడ్డి స్వయంగా లాఠీలు ఝులిపించడంపై భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపాయని అంటున్నారు. విపక్ష వైసీపీ శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జి చేయడాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా జనసేనాని పవన్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీసింది.
అంతేకాకుండా భక్తులపై లాఠీచార్జి జరగడంపై బీజేపీలో కూడా అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీసిందని అంటున్నారు. దీంతో లాఠీకి పనిచెప్పిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని అంటున్నారు. లాఠీచార్జికి కారణమైన పోలీసు అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పోలీసు అధికారుల వివరణ తర్వాత వారిపై బదిలీ వేటు వేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
