Begin typing your search above and press return to search.

'శ్రీశైలం' ఘటనకు కారణాలేంటి? ఆరా తీస్తున్న ప్రభుత్వం, కుట్ర ఉందా?

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత సోమవారం చోటుచేసుకున్న లాఠీచార్జిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది.

By:  Tupaki Desk   |   12 Feb 2026 10:32 PM IST
శ్రీశైలం ఘటనకు కారణాలేంటి? ఆరా తీస్తున్న ప్రభుత్వం, కుట్ర ఉందా?
X

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత సోమవారం చోటుచేసుకున్న లాఠీచార్జిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. భక్తులపై లాఠీచార్జికి దారి తీసిన కారణాలపై ఆరా తీస్తోంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేయడం ప్రభుత్వంలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఆలయంలో భక్తులపై లాఠీచార్జి చేయడానికి కారణాలు ఏంటి? అసలు ఆ సమయంలో ఏం జరిగింది? అన్న విషయంపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకు గురిచేసినట్లు చెబుతున్నారు. గతంలో తిరుమల ఆలయంలో తొక్కిసలాట, సింహాచలం ఆలయంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడం, కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మరణాలు ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేశాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో కూడా గత సోమవారం తీవ్ర తొక్కిసలాటకు దారితీసే పరిణామాలు చోటుచేసుకోవడంపై ప్రభుత్వం కంగారుపడినట్లు చెబుతున్నారు. అసలు ఎన్నడూ లేనట్లు శ్రీశైలంలో ఈ సారి ఎందుకిలా జరిగిందన్న విషయమై ఇటు పోలీసు, అటు దేవాదాయ అధికారులు ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతానికి ప్రభుత్వానికి చేరిన ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రీశైలం ఆలయంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య విభేదాల వల్ల ఆలయ పాలన గాడితప్పినట్లు ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందిందని అంటున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసరావును బదిలీ చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆలయ పాలన వ్యవహారాల్లో ఈవో పక్కాగా వ్యవహరిస్తుండటం, నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని ఈవో తెగేసి చెబుతుండటంతో నంద్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి నచ్చడం లేదని అంటున్నారు. దీంతో ఈవోను బదిలీ చేయించి గత ప్రభుత్వంలో ఈవోగా పనిచేసిన తనకు పరిచయస్తుడైన అధికారిని తిరిగి ఇక్కడికి రప్పించేందుకు ఆ ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ కారణంగా ఆలయంలో ఈవో, ఇతర ఉద్యోగుల మధ్య కూడా సమన్వయం కొరవడిందని, కొందరు ఉద్యోగులు ఈవోకు చెడ్డపేరు వచ్చేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వాస్తవానికి మహా శివరాత్రికి 15 నుంచి 20 ముందు నుంచే శ్రీశైలం ఆలయంలో రద్దీ ఉంటుందని చెబుతున్నారు. ఘటన జరిగిన సోమవారం ఆలయంలో సుమారు 6 వేల మంది భక్తులు ఉన్నారని అంటున్నారు. క్యూలైన్లలో రద్దీని నియంత్రిస్తూ కంపార్టమెంట్లలో వేచివున్న భక్తులను దర్శనాలకు పంపాల్సివుండగా, సోమవారం ఆలయ ప్రధాన గేటు వద్ద వందల మంది భక్తులు చొచ్చుకువచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.

ఈ సమయంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఏర్పడటంతో అదనపు ఎస్పీ యుగందర్ తప్పనిసరి పరిస్థితుల్లో లఠీ చార్జి చేయాల్సివచ్చిందని అంటున్నారు. అయితే భక్తులు ఒకేసారి ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించడం, భక్తుల ఆలయంలోని కంపార్టమెంట్ తాళాలు పగలు గొట్టినట్లు జరుగుతున్న ప్రచారం పలు అనుమానాలకు తావిస్తోంది. మాలాధారణలో ఉన్న భక్తులు ఇలా నియంత్రణ కోల్పోయి, తాళాలు విరగొట్టేలా వ్యవహరిస్తారా? అన్నదే సందేహాలకు తావిస్తోంది. ఆలయంలో ఇనుప గ్రిల్స్ ధ్వంసం చేసే స్థాయిలో భక్తులకు కోపం రావడానికి కారణమేంటి? ఎవరైనా వారిని రెచ్చగొట్టారా? లేక ఇంకేమైనా జరిగిందా? అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.