Begin typing your search above and press return to search.

అదృష్టం అంటే ఇదే.. రిటైర్డ్ ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్‌కు రూ. 225 కోట్ల జాక్‌పాట్!

ఆయన ఎమిరేట్స్ డ్రా MEGA7 గేమ్‌లో ఏకంగా రూ.225 కోట్లు గెలుచుకున్నారు.

By:  Tupaki Desk   |   26 May 2025 1:00 AM IST
అదృష్టం అంటే ఇదే.. రిటైర్డ్ ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్‌కు రూ. 225 కోట్ల జాక్‌పాట్!
X

రిటైర్ అయిన భారతీయ ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్ జీవితం అదృష్టంతో పూర్తిగా మారిపోయింది. ఆయన ఎమిరేట్స్ డ్రా MEGA7 గేమ్‌లో ఏకంగా రూ.225 కోట్లు గెలుచుకున్నారు. ఫోన్‌తో సరదాగా ప్రారంభించిన ఒక సాధారణ చర్య, ఒక భారతీయుడు గెలుచుకున్న అతిపెద్ద లాటరీ బహుమతులలో ఒకటిగా నిలిచింది.

శ్రీరామ్ రాజగోపాలన్ చెన్నై నివాసి. రెండు దశాబ్దాలకు పైగా సౌదీ అరేబియాలో పనిచేసిన తర్వాత 2023లో రిటైర్ అయ్యి తన స్వగ్రామమైన చెన్నైకి తిరిగి వచ్చారు. విశ్రాంత జీవితాన్ని గడపాలని కోరుకున్న ఆయనకు ఈ అసాధారణ సంఘటన స్వాగతం పలికింది. ఆయన గత కొంతకాలంగా లాటరీ డ్రాలలో పాల్గొనలేదు. అయితే, ఇటీవల మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 16న ఆయన గెలుపొందిన నంబర్లను సరిపోల్చారు."నేను ఫలితాలను చూసినప్పుడు, నమ్మలేకపోయాను. నేను డ్రా వీడియోను మళ్లీ ప్లే చేసి, విజేత నంబర్‌ల స్క్రీన్‌షాట్‌ను కూడా తీసుకున్నాను" అని ఆయన ఖలీజ్ టైమ్స్‌తో షేర్ చేసుకున్నారు.

2023లో రిటైర్ అయిన శ్రీరామ్ ఈ భారీ విజయాన్ని "70 శాతం సంతోషం, 30 శాతం భయం"గా అభివర్ణించారు. ఇంత పెద్ద మొత్తాన్ని నిర్వహించడం తనకు కొత్త అనుభవమని అంగీకరించారు. "ఇది చాలా పెద్ద మొత్తం.కానీ ఈ విజయం నా ఒక్కడి కోసమే కాదు. ఇది నా కుటుంబం.. నా పిల్లలు, చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఒక ఆశ. ప్రతి తండ్రి తమ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయాలని కలలు కంటారు. ఇప్పుడు నేను దాన్ని చేయగలను. ఇది తరతరాలకు సంపదను సృష్టించే అవకాశం" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఒక నిరాడంబరమైన మధ్యతరగతి కుటుంబంలో చెన్నైలో పెరిగిన శ్రీరామ్, 1998లో సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన తన భార్యతో కలిసి ఇద్దరు కుమారులను పెంచారు. శ్రీరామ్ తన గెలిచిన మొత్తంతో నిర్దిష్ట ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు. అందులో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. టైచెరోస్ (Tycheros) ద్వారా నిర్వహించబడే ఎమిరేట్స్ డ్రా, యూఏఈ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) నుంచి కొత్త నిబంధనల కారణంగా 2023 చివరిలో తన యూఏఈ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.